Gudiya: కుమార్తె ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించిన తల్లి... డీజిల్ పోయిస్తే వెతుకుతామన్న పోలీసులు!

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • బాలికను అపహరించిన బంధువు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి
  • వాహనాల డీజిల్ కు డబ్బులివ్వాలన్న పోలీసులు
  • డబ్బులు ఇచ్చినా పోలీసుల నిర్లక్ష్యం
Woman shocks after police demanded her fuel for their vehicles

ఉత్తరప్రదేశ్ లో కుమార్తె ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించిన తల్లికి ఊహించని అనుభవం ఎదురైంది. తమ వాహనాలకు డీజిల్ పోయిస్తే వెతుకుతామని పోలీసులు తెలపడంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి గురైంది. కాన్పూర్ కు చెందని గుడియా ఓ దివ్యాంగురాలు. భర్త చనిపోవడంతో ఆమె తన కుమార్తెతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతోంది. అయితే, ఆమె కుమార్తెను సమీప బంధువు కిడ్నాప్ చేశాడు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గుడియాకు వారి నుంచి దారుణమైన స్పందన వచ్చింది.

ఆమె కుమార్తెను వెతకాలంటే తమ వాహనాల డీజిల్ ఖర్చులు భరించాలని పోలీసులు గుడియాకు తేల్చి చెప్పారు. దాంతో చేసేది లేక ఆ దివ్యాంగురాలు అప్పులు చేసి రూ.15 వేలు పోలీసుల చేతిలో పెట్టింది. ఆ డబ్బులు కూడా అయిపోయినా, గుడియా మైనర్ కుమార్తె జాడ మాత్రం దొరకలేదు. దాంతో పోలీసులను ఆమె గట్టిగా ప్రశ్నించగా, వారి నుంచి హేయమైన మాటలు వచ్చాయి. అసలు నీ కుమార్తె మంచిదేనా? అంటూ ప్రశ్నించారు.

పోలీసుల వైఖరితో గుడియా తీవ్ర ఆవేదనకు గురైంది. దీనిపై తన ఆవేదనను  ఓ వీడియోలో వెళ్లగక్కింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. సదరు పోలీస్ ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేసి, మరో ఇన్ స్పెక్టర్ కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.

More Telugu News