Nirmala Sitharaman: నిన్నటి బడ్జెట్టులో ప్రస్తావించని ముఖ్యమైన అంశాలివి!

  • నిన్న పార్లమెంట్ ముందుకు వచ్చిన బడ్జెట్
  • పలు అంశాలను విస్మరించారంటున్న నిపుణులు
  • ప్రస్తావనేలేని చైనా సరిహద్దు అంశం
  • ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా పెరగని రక్షణ నిధులు
  • ఆరోగ్య సర్వే అంశాల విస్మరణ 
  • పెదవి విరుస్తున్న పలువురు ఆర్థిక నిపుణులు
Nirmala Misses these Items in her Budget

నిన్న లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను సుమారు గంటన్నరకు పైగా సాగిన తన ప్రసంగంలో సమర్పించారు. అయితే, ఆర్థిక పండితులు, రాజకీయ విశ్లేషకులు మంత్రి నిర్మల పలు అంశాలను విస్మరించారని గుర్తు చేస్తున్నారు.

వీటిల్లో అతి ముఖ్యమైనది చైనా సరిహద్దు అంశం. గత కొన్ని నెలలుగా చైనా, ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎలా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. నిర్మలమ్మ తన ప్రసంగంలో వాటి గురించి ఒక్క పదం కూడా చెప్పలేదు. సైన్యం గురించిన ప్రస్తావన కూడా లేదు. ఇదే సమయంలో గత సంవత్సరం రక్షణ రంగానికి కేటాయించిన రూ.3,43,822 కోట్లతో పోలిస్తే, ఈ సంవత్సరం 0.95 శాతం అదనంగా రూ.3,47,088 కోట్లను కేటాయిస్తున్నట్టు ఆమె తెలిపారు.

వాస్తవ ద్రవ్యోల్బణం గణాంకాలతో పోల్చి చూస్తే, పైకి రక్షణ రంగ బడ్జెట్ కేటాయింపులు పెరిగినట్టు కనిపించినా, ఆ బడ్జెట్ తక్కువేనన్నది నిపుణులు అంటున్నారు. భారత త్రివిధ దళాల వద్ద ఉన్న ఆయుధాల్లో 68 శాతం కాలం చెల్లినవేనని గుర్తు చేస్తున్న విశ్లేషకులు, రక్షణ రంగానికి కేటాయింపులు పెంచకుండా దేశాన్ని ఎలా కాపాడగలమని ప్రశ్నిస్తున్నారు. రక్షణ అవసరాలకు, వాస్తవ కేటాయింపులకు కనీసం రూ.1.12 లక్షల కోట్ల వ్యత్యాసం ఉందని, దీన్ని ఎలా భర్తీ చేయాలన్న విషయమై ఆర్థిక మంత్రి ప్రకటించలేదని అంటున్నారు.

ఇక హెల్త్ కేర్ విషయానికి వస్తే, ఇండియాలో 2014 నుంచి 2019 మధ్య పుట్టిన పిల్లలు, అంతకుముందు ఐదేళ్లలో పుట్టిన చిన్నారులతో పోలిస్తే, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చి చెప్పిన నేపథ్యంలో, తదుపరి తరానికి కీలకమైన ఈ విషయంలో నిర్మల ఏ విధమైన కేటాయింపులు, ప్రకటనా చేయలేదు. వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులను 137 శాతం పెంచుతున్నామని పేర్కొన్నా, అందులోనే మంచి నీరు, మురుగునీటి పారుదలకు సంబంధించిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ గా ఉన్న రూ.49,214 కోట్లను కలిపేశారు. దీంతో ఆరోగ్య రంగానికి వాస్తవ పెంపుదల కేవలం 9 శాతమే అని తేలుతోంది.

ఆపై వ్యవసాయం, విద్య విషయాలకు వస్తే, ప్రస్తుతం ఈ ప్రభుత్వంపై రైతుల్లో ఉన్న నమ్మకం కొంత మాత్రమేనని, ఎన్టీయే సర్కారు రైతు వ్యతిరేకమని ఇండియాలో గత రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల ఆదాయం పెంచడం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, గతంలో చెప్పిన 22 శాతం మద్దతు ధర పెంపు వంటి అంశాలపై నిర్మల నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. రైతులను ఆదుకుంటామని, వారి అనుమానాలను నివృత్తి చేస్తామని చెప్పడం మినహా మరేమీ ఆమె హామీ ఇవ్వలేదు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన, రీసెర్చ్, వాతావరణ మార్పులు తదితర అంశాలకు ఈ బడ్జెట్ లో చోటు దక్కలేదు.

దేశ విద్యా వ్యవస్థ ఓ సంవత్సరం వెనుకబడిపోయింది. కరోనా కారణంగా గత సంవత్సరం ఏ పాఠశాల, విద్యా సంస్థా తెరచుకోలేదు. ఇప్పుడిప్పుడే 9వ తరగతి నుంచి పాఠశాలలు తెరచుకుంటున్నాయి. టెస్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు సిలబస్ తగ్గించి పరీక్షలు నిర్వహిస్తారని భావిస్తున్నా, మిగతా తరగతులకు గతేడాది మాదిరి గానే, ఈ సంవత్సరం కూడా ప్రమోషన్ అవకాశం ఉంటుందని తెలుస్తున్న నేపథ్యంలో, విద్యా వ్యవస్థకు గతేడాది కేటాయించిన మొత్తంతో పోలిస్తే, ఈ సంవత్సరం కేటాయింపులు తగ్గాయి.

మొత్తం మీద విద్యా రంగానికి 6.13 శాతం మేరకు నిధుల కోత కనిపించింది. జాతీయ విద్యా వ్యవస్థ జీడీపీలో 6 శాతం ప్రాతినిధ్యంతో నిధులను డిమాండ్ చేసినా, ఆ మేరకు నిధులు దక్కలేదు. ఈ తరం యువతకు అత్యంత కీలకమైన విద్యా రంగానికి కేటాయింపులు తృప్తికరంగా లేవని నిపుణులు పెదవి విరుస్తున్నారు.

ఆపై వాణిజ్యం, బ్యాంకింగ్ విషయానికి వస్తే, బ్యాంకింగ్ సెక్టారులో కరోనా తరువాత నికర నిరర్థక ఆస్తుల విలువ గణనీయంగా పెరిగిపోయింది. గడచిన సెప్టెంబర్ నాటికే స్థూల ఎన్పీఏ 16.2 శాతానికి పెరిగి పోయిందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. బ్యాంకులకు మూలధనం కేటాయింపులుగా రూ. 20 వేల కోట్లను కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి పేర్కొన్నా, ఇది ఏ మూలకూ చాలదని, బ్యాంకుల పునరుత్తేజానికి ఈ మొత్తం సరిపోదని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు.

కాటన్ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు గుజరాత్ వంటి రాష్ట్రాల్లోని రైతులకు మేలు చేసినా, ఇదే సమయంలో యార్న్ పై పెంచిన పన్నులు తిరుప్పూర్ తదితర ప్రాంతాల్లోని వస్తు ఉత్పత్తిదారులపై ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ లాభపడేలా మార్గాలను అన్వేషించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తం మీద 'వన్ నేషన్ వన్ రేషన్' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలా సీతారామన్, తన ప్రసంగాన్ని చివరకు ఓ ఎన్నికల ప్రసంగంలా మార్చారని, ఈ సంవత్సరం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు లబ్ది కలిగించేలా ప్రతిపాదనలు ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. మెగా ప్రాజెక్టులన్నీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే వెళ్లాయని అంటున్నారు. తదుపరి బడ్జెట్ సవరణల్లో ఈ తప్పులను సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు.

More Telugu News