USA: అమెరికన్లకు శుభవార్త... త్వరలోనే కొవిడ్ పరీక్ష ఇంట్లోనే!

  • ఇప్పటికే ఆమోదించిన యూఎస్ ఎఫ్డీయే
  • 30 డాలర్లకు దిగిరానున్న ఒక్కో కిట్ ధర
  • వెల్లడించిన బైడెన్ సలహాదారు ఆండీ సాల్విట్
Corona Testing Kit in Home says White House

శ్వేతసౌధం నుంచి అమెరికా ప్రజలకు ఓ శుభవార్త వచ్చింది. కరోనా వైరస్ పరీక్షలను ఇంట్లోనే సులువుగా చేసుకునే రాపిడ్ టెస్ట్ కిట్ లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వైట్ హౌస్ సోమవారం నాడు పేర్కొంది. మొత్తం 85 లక్షల టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది.

ఆస్ట్రేలియాకు చెందిన ఎలూమ్ సంస్థతో టెస్టింగ్ కిట్ల తయారీకి 321.8 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును కుదుర్చుకున్నామని, ఈ కిట్లతో నిమిషాల్లోనే శరీరంలో కరోనా వైరస్ ఉందా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవచ్చని పేర్కొంది.

గత సంవత్సర కాలంగా ఎంతో మంది వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగానే చౌక ధరలో, వేగంగా వైరస్ ను కనుగొనే కిట్ లు లభించాయని, వీటితో వైరస్ వ్యాప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుని, అడ్డుకోవచ్చని ఉన్నతాధికారులు వెల్లడించారు. కరోనా లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే చౌక ధరలో లభించే వీటిని వాడుకోవచ్చని తెలిపారు.

ఈ హోమ్ కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ ను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిసెంబర్ 15నే ఆమోదించింది. అయితే, అప్పటి నుంచి ఈ కిట్ లు పరిమిత సంఖ్యలోనే అందుబాటులోకి వచ్చాయి. ఎలూమ్ తయారు చేసిన కిట్లతో సులువుగా కరోనా జాడ తెలుసుకోవచ్చని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సీనియర్ సలహాదారు, కొవిడ్-19 రెస్పాన్స్ టీమ్ కు నాయకత్వం వహిస్తున్న ఆండీ సాల్విట్ వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా టెస్టింగ్ ధర 100 నుంచి 200 డాలర్ల వరకూ ఉండగా, ఈ కిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, ధర 30 డాలర్లకు తగ్గి వస్తుందని ఆయన అన్నారు. కిట్ ల తయారీ మరింతగా పెరిగితే, ధర ఇంకా తగ్గుతుందని 'వాషింగ్టన్ పోస్ట్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ఇదే సమయంలో ఈ టెస్టింగ్ కిట్ల తయారీని భారీగా చేపట్టనున్నట్టు ఎలూమీ సీఈఓ సీన్ పార్సన్స్ వెల్లడించారు. వీటి తయారీ కోసం అతి త్వరలోనే యూఎస్ లో ప్లాంటును నెలకొల్పనున్నట్టు తెలియజేశారు.

More Telugu News