TRS: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లదాడి ఘటన.. 44 మందికి రిమాండ్

  • ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో 57 మంది అరెస్ట్
  • రిమాండ్‌కు తరలించిన వారిలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి
  • బీజేపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన
TRS MLA house stone attack 44 BJP leaders remanded

ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లదాడి ఘటనలో పోలీసులు 57 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 44 మందికి వరంగల్ ఆరో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ విధించింది. వీరిలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తదితరులు ఉన్నారు. మరోవైపు, వీరి బెయిలు పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా పడింది.

అయోధ్య రామమందిరం విషయంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ కార్యకర్తలు ఆదివారం హన్మకొండలోని ఆయన ఇంటిపై దాడిచేశారు. అడ్డుకున్న పోలీసులతో వారు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనలో 57 మందిపై కేసులు పెట్టిన పోలీసులు తొలుత కొండేటి శ్రీధర్ సహా 38 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం పద్మారెడ్డితోపాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ నిన్న కోర్టులో హాజరు పరచగా 44 మందికి కోర్టు రిమాండ్ విధించింది.

మరోవైపు, ఎమ్మెల్యే చల్లా ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న పరకాల, ఆత్మకూరులో టీఆర్ఎస్ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు. దామెరలో బీజేపీ నేతల దిష్టిబొమ్మను దహనం చేశారు. గీసుకొండ మండలంలోని కోనాయమాకులలో రాస్తారోకో చేశారు. ఆదివారం రాత్రి పరకాలలోని బీజేపీ కార్యాలయ బోర్డుకు నిప్పు పెట్టిన ఘటనలో నలుగురు టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

More Telugu News