Union Budget 2021-22: బడ్జెట్లో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం: జనసేన

  • కేంద్ర బడ్జెట్ పై జనసేన స్పందన
  • అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అన్న నాదెండ్ల
  • యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి
  • ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ లకు అభినందనలు
Janasena says they welcomes the union budget

కేంద్ర బడ్జెట్ పై జనసేన పార్టీ స్పందించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలై, మానవాళి మనుగడే ప్రశ్నార్థకమైన వేళ అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ తీసుకువచ్చారని కొనియాడారు. ప్రజారోగ్యానికి రూ.2.23 లక్షల కోట్లు, కరోనా వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు ప్రకటిస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం అని తెలిపారు.

అటు, పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో విశాఖ ఓడరేవును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించాలని పేర్కొన్నారు. చిత్తూరు నుంచి తమిళనాడుకు, విజయవాడ నుంచి ఖరగ్ పూర్ కు సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తున్నారని... విజయవాడలో అధికంగా ఉండే ట్రాన్స్ పోర్టు ఆపరేటర్లకు ఇది శుభవార్త అని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జనసేన భావిస్తోందని తెలిపారు. కష్టకాలంలో అందరినీ మెప్పించే బడ్జెట్ తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లకు జనసేన తరఫున అభినందనలు తెలుపుతున్నామని ఓ ప్రకటన చేశారు.

More Telugu News