Union Budget 2021-22: బడ్జెట్ లో ఏపీకి ఏమీ ఇవ్వని కేంద్రాన్ని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు: నారా లోకేశ్

  • జగన్ రాష్ట్రాన్ని మరోసారి దగా చేశాడన్న లోకేశ్
  • ఉత్తరకుమార ప్రగల్భాలు పలికాడని ఆరోపణ
  • తనను కేసుల నుంచి తప్పిస్తే చాలంటున్నాడని విమర్శలు
  • 28 మంది ఎంపీలను కేంద్రానికి తాకట్టు పెట్టారని వ్యాఖ్యలు
Nara Lokesh fires on CM Jagan over union budget

వార్షిక బడ్జెట్ నేపథ్యంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జనాన్ని మోసం చేసే జగన్ మోహన్ రెడ్డి మరోసారి రాష్ట్రాన్ని దగా చేశాడని మండిపడ్డారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా సాధిస్తానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని విమర్శించారు. చివరికి తనను 31 కేసుల నుంచి తప్పిస్తే చాలని, ప్రత్యేక హోదా ఊసెత్తనంటూ  28 మంది ఎంపీలను కేంద్రానికి తాకట్టుపెట్టాడని లోకేశ్ వ్యంగ్యంగా అన్నారు.

విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన హామీలకు బాబాయ్ హత్య కేసుతో కేంద్రం చెల్లు చేసిందని తెలిపారు. బడ్జెట్ లో నిధులు కేటాయించక్కర్లేదు కానీ, సహనిందితులైన అధికారులను తనకు కేటాయిస్తే చాలని కేంద్రం వద్ద జగన్ సాగిలపడ్డాడని ఎద్దేవా చేశారు. అప్పులు వాడుకోవడానికి అనుమతిస్తే చాలు... ఏ ప్రాజెక్టులివ్వకపోయినా ఫర్వాలేదని ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు. బడ్జెట్ లో ఏపీకి ఏమీ ఇవ్వని కేంద్రాన్ని ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడని లోకేశ్ విమర్శించారు.

More Telugu News