SEC: ఉద్యోగులు పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకోవద్దని నిమ్మగడ్డ రమేశ్ ను కోరాం: ఉద్యోగ సంఘాల నేతలు

  • ఉద్యోగులకు త్వరగా వ్యాక్సిన్ ఇప్పించాలని కోరాం
  • ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య నలిగిపోతున్నామని తెలిపాం
  • పోలింగ్ ను ఒంటి గంట వరకే నిర్వహించాలని విజ్ఞప్తి 
Employees unions leadrs meets Nimmagadda Ramesh

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ను ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. అనంతరం మీడియాతో జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా రక్షణ ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీని కోరామని చెప్పారు. ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు త్వరగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కోరామని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని తెలిపామని అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధులను నిర్వహించేందుకు ఉద్యోగులు భయపడుతున్నారని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి సమయం పడుతుందని, అందువల్ల మూడు విడతల ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని ఎస్ఈసీని కోరామని... అయితే రీషెడ్యూల్ చేయలేమని ఎస్ఈసీ చెప్పారని అన్నారు. వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. పోలింగును ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు పరిమితం చేయాలని కోరామని తెలిపారు.

ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారనే విషయాన్ని ఎస్ఈసీకి చెప్పామని తెలిపారు. ఉద్యోగులు ఎవరైనా ఒత్తిడిలో పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకోవద్దని కోరామని చెప్పారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, ఉద్యోగులకు తగిన భద్రతను ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు. తాను ఎవరిపైనా ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోవడం లేదని... ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తూ, తనను ఇబ్బంది పెట్టిన వారిపై మాత్రమే చర్యలకు వెళ్తున్నానని ఎస్ఈసీ చెప్పారని వెల్లడించారు.

More Telugu News