Nimmagadda Ramesh Kumar: నేను ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని స్ప‌ష్టం చేశా: ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ

  • వైఎస్ఆర్ హ‌యాంలో ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశా
  • ఆయ‌న‌లో లౌకిక దృక్ప‌థం ఉండేది
  • ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాలకు నేనే ప్ర‌త్య‌క్ష‌సాక్షిని
  • మావాళ్లు, మీవాళ్లు అంటూ కొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తున్నారు
  • అసాధారణ ఏకగ్రీవాల ప్రక్రియ స‌రికాదు
i have no fear says nimmagadda

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నికల సంఘం ప్ర‌ధానాధికారి‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ ఈ రోజు క‌డప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒంటిమిట్ట కోదండ రాముడిని దర్శించుకుని, అభిషేక పూజల్లో పాల్గొని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. అనంత‌రం ఆ జిల్లాలో స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.  

ఈ సంద‌ర్భంగా మీడియా సమావేశంలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు చెప్పారు. అసాధారణ ఏకగ్రీవాల ప్రక్రియ స‌రికాద‌ని తెలిపారు. ఇటువంటి ప్ర‌క్రియ‌పై షాడో బృందాలు దృష్టి పెడతాయని చెప్పారు. బెదిరింపుల‌కు పాల్ప‌డే వారిపై షాడో టీమ్‌ల‌తో నిఘా ఉంటుందని తెలిపారు. అందరికీ సమాన న్యాయం కల్పించాలన్నదే లక్ష్యమ‌ని చెప్పారు.

అలాగే, ఎన్నికలు సకాలంలో జరగాలని అన్నారు. తాను వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశాన‌ని, ఆయ‌న‌లో లౌకిక దృక్ప‌థం ఉండేద‌ని చెప్పారు.

త‌న‌పై ఆయ‌న ఉంచిన న‌మ్మ‌కాన్ని తాను వ‌మ్ము చేయ‌లేద‌ని తెలిపారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాలకు తానే ప్ర‌త్య‌క్ష‌సాక్షిన‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏ ప‌రిస్థితుల్లోనూ భ‌య‌పడే ప్ర‌స‌క్తేలేద‌ని తాను స్ప‌ష్టం చేశాన‌ని అన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌రైన స‌మ‌యంలో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డ‌మ‌నేది రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్క‌ని పున‌రుద్ఘాటించారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను గౌర‌వించ‌కుండా కొంద‌రు మావాళ్లు, మీవాళ్లు అంటూ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, ఆ తీరు స‌రికాద‌ని చెప్పారు. మీడియాను మించిన నిఘా మ‌రొక‌టి ఉండ‌బోద‌ని, స‌మాజ హితం కోసం చురుకైన బాధ్య‌త‌ను మీడియా తీసుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని చెప్పారు.

More Telugu News