Kanakamedala Ravindra Kumar: విశాఖ రాజధాని అని చెప్పి రైల్వే జోన్ మరిచిపోయారు: కనకమేడల విమర్శలు

  • ప్రత్యేక హోదా పదాన్ని వైసీపీ నేతలు మర్చిపోయారు
  • కేంద్రంతో కేసులపై చర్చించుకుంటున్నారు
  • పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేస్తే తప్పేముంది?
YSRCP leaders fogotten Special status says Kanakamedala

ప్రత్యేక హోదా పదాన్ని వైసీపీ నేతలు మర్చిపోయారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఎద్దేవా చేశారు. విశాఖపట్నం రాజధాని అని చెపుతూ, విశాఖ రైల్వే జోన్ ను మర్చిపోయారని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి మాట్లాడటం లేదని... వారిపై ఉన్న కేసులపై కేంద్రంతో రహస్య సమావేశాలను నిర్వహిస్తూ కేసుల గురించి మాట్లాడుకుంటున్నారని దుయ్యబట్టారు. పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వైసీపీ నేతలకు చంద్రబాబు గురించి మాట్లాడే హక్కే లేదని అన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ల వల్ల పలువురు అధికారులు జైలుకు వెళ్లొచ్చారని కనకమేడల చెప్పారు. ఓ వైపు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న వైసీపీ నేతలు మరోవైపు రాజ్యాంగం గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎస్ఈసీని దొడ్డిదారిన తొలగిస్తే... ప్రభుత్వంపై కోర్టులు మొట్టికాయలు వేశాయని చెప్పారు. తిరిగి నిమ్మగడ్డను నియమించాయని తెలిపారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తిపై కులం ముద్ర వేయడం దారుణమని చెప్పారు.

సలహాదారులను నియమించుకుని మంత్రులను కూడా మాట్లాడకుండా చేస్తున్నారని, మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయారని విమర్శించారు. వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. వైసీపీ నేతల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.

More Telugu News