vaccine: భారత్‌లో వ్యాక్సిన్ల త‌యారీపై ఐక్య‌రాజ్య‌స‌మితి ప్రశంస‌ల జ‌ల్లు!

  • వ్యాక్సిన్ల‌ను అందించ‌డంలో భారత్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంది
  • పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ల‌ను తయారు చేసే సామర్థ్యం ఉంది
  • ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తి భార‌త్‌
un praises india effort to produce vaccines

క‌రోనాతో ప్ర‌పంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న నేప‌థ్యంలో భార‌త్ స‌హా ప‌లు దేశాలు అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్లు ఊర‌ట క‌లిగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో పెద్ద ఎత్తున ఉత్ప‌త్తి అవుతోన్న వ్యాక్సిన్ల‌పై ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది.

వ్యాక్సిన్ల‌ను అందించ‌డంలో భారత్‌ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఐరాస‌ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ల‌ను తయారు చేసే భారత్‌ సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తి అంటూ ఆయ‌న కొనియాడారు. భారత్‌లో ఎన్నో వ్యాక్సిన్లు తయారవుతున్న విషయం తమకు తెలుసని చెప్పారు.

ఈ నేప‌థ్యంలో తాము భార‌త్‌లోని వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. ప్ర‌పంచానికి వ్యాక్సిన్‌ను అందించేందుకు భారత్ కూడా సిద్ధంగా ఉందని తాము భావిస్తున్న‌ట్లు చెప్పారు. ప్రపంచదేశాలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్లను అందించే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అలాగే, ప్ర‌పంచంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల తయారీ లైసెన్స్‌లను ఆయా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలకు బదిలీ చేయాలని ఆంటోనియో గుటెర్రస్ పిలుపునిచ్చారు. కాగా, ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌కు భార‌త్ భారీగా వ్యాక్సిన్ల‌ను అందిస్తోంది. ఇప్ప‌టికే భార‌త పొరుగు దేశాల‌కు ల‌క్ష‌లాది డోసులను భార‌త్ స‌ర‌ఫ‌రా చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ దేశాల‌కు భార‌త్ మొత్తం 55 లక్షల డోసులను పంపింది.

More Telugu News