Nimmagadda Ramesh Kumar: రవిచంద్రను ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియమించిన ఎస్‌ఈసీ.. వైద్యశాఖ కార్యదర్శిగా పంపిన ప్రభుత్వం!

Andhrapradesh govt Vs SEC Nimmagadda fight continuous
  • ఏ పోస్టూ లేకుండా ఖాళీగా ఉన్న ఐఏఎస్ అధికారి రవిచంద్ర
  • ఎస్‌ఈసీ ఉత్తర్వుల తర్వాత హడావుడిగా ఆయన కోసం ఓ పోస్టును సృష్టించిన ప్రభుత్వం
  • కార్యదర్శి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లను పంపిన సర్కారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య రాజుకున్న రాజకీయ వేడి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల రద్దుతో మొదలైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న వేళ ఎస్ఈసీకి, ప్రభుత్వానికి మధ్య మరోమారు వివాదం చెలరేగింది. ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియమిస్తూ ఎస్ఈసీ నిన్న సాయంత్రం ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపించారు.

అయితే, ఆ తర్వాత కాసేపటికే ప్రభుత్వం ఆయనను వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శిగా నియమించి కొవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యతలను అప్పగించింది. అంతేకాదు, ఇందుకోసం ప్రత్యేకంగా ఎక్స్ కేడర్ కార్యదర్శి పోస్టును సృష్టించడం గమనార్హం. ఎన్నికల సంఘం కార్యదర్శి పోస్టు కోసం రాజబాబు, కన్నబాబు, విజయ్‌కుమార్ పేర్లను ఎస్‌ఈసీకి సూచించింది.

ఇప్పటి వరకు ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్‌ను ఇటీవల ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అప్పగించింది. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉండగా, ప్రస్తుతం ఏ పోస్టులోనూ లేని రవిచంద్రను ఇందుకోసం ఎంపిక చేసింది. అయితే, ప్రభుత్వం మాత్రం హడావుడిగా ఆయన కోసం ఓ పోస్టును సృష్టించి మరీ అక్కడికి పంపడం వివాదాస్పదమైంది.

  • Loading...

More Telugu News