గంగూలీకి మరోసారి ఏంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు

28-01-2021 Thu 19:02
  • కోల్ కతా అపోలో ఆసుపత్రిలో దాదాకు చికిత్స  
  • గంగూలీకి పశ్చిమ బెంగాల్ సీఎం పరామర్శ
  • ఏంజియో ప్లాస్టీ విజయవంతం అయిందన్న మమతాబెనర్జీ
  • గంగూలీకి మరో రెండు స్టెంట్లు అమర్చారని వెల్లడి
  • డాక్టర్లకు అభినందనలు
Another Angiolpasty for BCCI Chief Sourav Ganguly
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మరోసారి ఏంజియోప్లాస్టీ నిర్వహించారు. నిన్న ఛాతీలో నొప్పి కారణంగా గంగూలీ కార్డియాక్ చెకప్ కోసం కోల్ కతాలోని అపోలో ఆసుపత్రికి వెళ్లగా, అక్కడి వైద్యులు మరోసారి ఏంజియోప్లాస్టీ చేయాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు గంగూలీ నేడు ఏంజియో ప్లాస్టీ చేయించుకున్నారు. వైద్యులు ఆయనకు మరో రెండు స్టెంట్లు అమర్చారు.

కాగా, గంగూలీకి మరో ఏంజియోప్లాస్టీ నిర్వహించిన సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడే ఉన్నారు. ఏంజియో ప్లాస్టీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆమె గంగూలీని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గంగూలీ స్పృహలోనే ఉన్నారని, మాట్లాడుతున్నారని వెల్లడించారు. ఆయనకు నిర్వహించిన ఏంజియో ప్లాస్టీ విజయవంతమైందని తెలిపారు. తాను గంగూలీతోనూ, ఆయన భార్య డోనాతోనూ మాట్లాడినట్టు మమతా వివరించారు. అంతేకాదు, గంగూలీకి విజయవంతంగా ఏంజియోప్లాస్టీ నిర్వహించినందుకు డాక్టర్లను అభినందించానని వెల్లడించారు.

గంగూలీకి ఇంతకుముందు కోల్ కతాలోని వుడ్ లాండ్స్ ఆసుపత్రిలో తొలిసారిగా ఏంజియోప్లాస్టీ నిర్వహించారు. ఆ సమయంలోనే మరో ఏంజియోప్లాస్టీ అవసరం అవుతుందని డాక్టర్లు చెప్పారు.