Jayalalitha: స్మారక భవనంగా మారిన జయలలిత నివాసం.. హైకోర్టులో కొనసాగుతున్న కేసు!

  • స్మారక భవనాన్ని ప్రారంభించిన సీఎం పళనిస్వామి
  • సందర్శకులను అనుమతించవద్దని ఆదేశించిన హైకోర్టు
  • ఆ భవనం తమకే చెందుతుందని కేసు వేసిన దీప, దీపక్
Jayalalitha residence converted into memorial

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసం స్మారక భవనంగా మారింది. చెన్నై పోయస్ గార్డెన్ లోని వేదనిలయంలో జయ దశాబ్దాల పాటు నివాసం ఉన్నారు. ఆ జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం ఆ భవనాన్ని మెమోరియల్ గా మార్చింది. ఈరోజు నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పళనిస్వామి స్మారక భవనాన్ని ప్రారంభించారు.

మరోవైపు, వేదనిలయం గేట్లను మాత్రమే తెరవాలని, సందర్శకుల కోసం భవనం తలుపులను తెరవొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశాలను జారీ చేసిన మరుసటి రోజే స్మారక భవనాన్ని పళనిస్వామి ప్రారంభించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భవనం తాళాలను హైకోర్టుకు ప్రభుత్వం అందించింది.

జయకు చెందిన ఈ భవనం వారసత్వంగా తమకే చెందుతుందని ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలోనే, స్మారక భవనంలోకి సందర్శకులను అనుమతించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు మరో విధంగా ఉన్నాయి. వారసులకు కేవలం పరిహార రూపంలోనే సహాయం చేయాలని, ఆస్తిపై వారికి హక్కులు ఇవ్వకూడదని వాదిస్తోంది. ఈ అంశంపై హైకోర్టు తుది తీర్పును ఎలా వెలువరిస్తుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.

More Telugu News