China: స్వాతంత్ర్యం కావాలా... అయితే యుద్ధమే!... తైవాన్ పై నిప్పులు చెరుగుతున్న చైనా

China fires on Taiawan and said independence means war
  • తైవాన్, చైనా మధ్య ముదురుతున్న వివాదాలు
  • ఇటీవల తైవాన్ గగనతలంలో చైనా యుద్ధ విమానాలు
  • దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధనౌకలు
  • తాజా పరిణామాలపై మండిపడుతున్న చైనా
  • నిప్పుతో చెలగాటమాడొద్దంటూ వార్నింగ్
తైవాన్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా తయారైంది. గత కొంతకాలంగా తైవాన్ పై బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్న చైనా తాజాగా, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ అంశంలో విదేశీ జోక్యం పెచ్చుమీరుతోందంటూ పరోక్షంగా అమెరికాపైనా మండిపడుతోంది.

తాజాగా చైనా రక్షణ శాఖ చేసిన ప్రకటన ఈ వివాదాన్ని మరింత పెంచేలా ఉంది. తైవాన్ కు స్వాతంత్ర్యం అంటే యుద్ధం తప్పదని హెచ్చరించింది. చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వు కియాన్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. తైవాన్ లో కొందరు మాత్రమే స్వాతంత్ర్యం కావాలంటున్నారని, నిప్పుతో చెలగాటం ఆడితే ఆ నిప్పుకే ఆహుతి అయిపోతారని స్పష్టం చేశారు.

ఇటీవలే చైనా యుద్ధ విమానాలు తన గగనతలంలోకి వచ్చాయని తైవాన్ ఆరోపించగా, అమెరికాకు చెందిన విమాన వాహక నౌకలు దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించాయి. ఈ పరిణామాలు చైనాకు సహజంగానే ఆగ్రహం తెప్పించాయి. తన సార్వభౌమత్వాన్ని సవాలు చేసేందుకు దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించినట్టు డ్రాగన్ భావిస్తోంది.

అటు, తైవాన్ అధ్యక్షుడు తై ఇంగ్ వెన్ తమది ఇప్పటికే స్వతంత్ర దేశమని, తమ దేశం పేరు రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పేర్కొంటుండడం చైనాకు కంటగింపుగా మారింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా ఎప్పటినుంచో చెబుతున్న సంగతి తెలిసిందే.
China
Taiwan
Independenca
War

More Telugu News