USA: బైడెన్​ అధ్యక్షుడయ్యాక తొలిసారి భారత్​ కు అమెరికా ఫోన్!

  • మన రక్షణ మంత్రి రాజ్ నాథ్ తో ఆ దేశ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చర్చలు
  • ఇరు దేశాల ప్రయోజనాలున్న విషయాలపై చర్చ
  • లాయిడ్ ముందు చైనా తీరును ఎండగట్టిన రాజ్ నాథ్ సింగ్
  • అజిత్ దోవల్ కు ఫోన్ చేసిన ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు
First engagement between India and Biden administration

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడైతే.. భారత్ తో సంబంధాలు అంతంత మాత్రమే ఉంటాయని అంతా విశ్లేషించారు. అయితే, ఆయన అధ్యక్షుడయ్యాక తొలిసారి అక్కడి నుంచి మనకు ఫోన్ వచ్చింది. ఆ దేశ కొత్త రక్షణ మంత్రి జనరల్ (రిటైర్డ్) లాయిడ్ ఆస్టిన్ .. మన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు బుధవారం ఫోన్ చేశారు. అంతేగాకుండా ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్.. మన భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు కాల్ చేశారు.

ఈ విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అమెరికా రక్షణ మంత్రి ఫోన్ చేశారని, అమెరికా కొత్త రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాకాంక్షలు చెప్పానని అన్నారు. భారత్–అమెరికా మధ్య రక్షణ సహకారం మరింత బలపరిచేందుకు కట్టుబడి ఉన్నట్టు వివరించానన్నారు.

ఇరు దేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించామని తెలిపారు. కాగా, ఫోన్ సంభాషణల్లో చైనా తీరు గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. రాజకీయభౌగోళిక పరిణామాలు, ఇండో పసిఫిక్ రీజియన్ లో భారత్, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలపై చర్చించినట్టు సమాచారం.

కాగా, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై భారత్, అమెరికా కలిసి పోరాడాలని అజిత్ దోవల్ చెప్పినట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉగ్రవాదం, తీర ప్రాంత రక్షణ, సైబర్ భద్రత, శాంతి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం వంటి విషయాల్లో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారని తెలిపింది. రెండు దేశాలకున్న అంతర్జాతీయ సవాళ్లపై కలిసి పోరాడేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్టు జేక్ సల్లివాన్ చెప్పారంది.

More Telugu News