కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం... యజమాని బిడ్డల కిడ్నాప్!

28-01-2021 Thu 10:40
  • ముంబైలో జరిగిన ఘటన
  • కిడ్నాప్ చేసి రూ. కోటి డిమాండ్
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
Driver Kidnap Employeer Twins in Mumbai

తన కూతురు పెళ్లి నిమిత్తం అడ్డదారులు తొక్కి, యజమాని కవల పిల్లలను కిడ్నాప్ చేసి, డబ్బు కోసం బెదిరించిన ఓ డ్రైవర్ ను, అతనికి సహాయపడిన మరో బంధువును ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నగరంలో నిర్మాణ రంగంలో సేవలందిస్తున్న ఓ బిల్డర్, తన ఇద్దరు పిల్లలూ కిడ్నాప్ నకు గురయ్యారని, ఎవరో ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.

డ్రైవర్ తో కలిసి తన పిల్లలు జుహూకు వెళ్లారని, తిరిగి వస్తున్న క్రమంలో డ్రైవర్ ను అటకాయించిన కిడ్నాపర్లు, అతన్ని కొట్టి, తన పిల్లలను తీసుకెళ్లిపోయారని ఆ వ్యాపారి పోలీసులకు చెప్పాడు. ఇద్దరు పిల్లలను, డ్రైవర్ నూ బెదిరించి, వారిని తమతో తీసుకెళ్లారని, తన భార్యకు ఫోన్ చేసి డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.

అప్పటికే పిల్లల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు జుహూ పీవీఆర్ ప్రాంతంలో ఓ బిడ్డను రక్షించగా, రెండో బిడ్డను స్థానికులు కాపాడారు. ఆపై కిడ్నాపర్ల ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగించిన పోలీసులు, తొలుత కారు డ్రైవర్ ను ప్రశ్నించారు. దాదాపు 18 గంటల విచారణ తరువాత, తన బిడ్డ వివాహం నిమిత్తం తానే ఈ దుర్మార్గానికి పాల్పడ్డానని అతను చెప్పాడు. తనకు పిల్లలను హత్య చేసే ఉద్దేశం లేదన్నాడు.

తానొక్కడినే ఇంత కిడ్నాప్ చేయలేనన్న ఆలోచనతో సగం డబ్బు ఇచ్చే ఒప్పందంపై ఓ సన్నిహితుడి తోడు తీసుకున్నానని అతను చెప్పడంతో, ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని రిమాండ్ కు తరలించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.