అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు మరో షాక్.. యూట్యూబ్ ఖాతా నిరవధికంగా నిలిపివేత

28-01-2021 Thu 10:19
  • కేపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్ ఖాతాపై నిషేధం
  • తమ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయన్న యూట్యూబ్ ప్రతినిధి
  • ట్రంప్ సలహాదారు రూడీ చానల్‌పైనా ఆంక్షలు
YouTube extends suspension of Trumps channel indefinitely

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ మరోమారు షాకిచ్చింది. ఆయన చానల్‌పై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్టు పేర్కొంది. హింసాత్మక ఆందోళనల దృష్ట్యా డొనాల్డ్ జె. ట్రంప్ చానల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు యూట్యూబ్ ప్రతినిధి ఐవీ చోయ్ తెలిపారు. తమ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని, ఏవైనా కొత్త పరిణామాల కోసం నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు.

అలాగే, ట్రంప్ సలహాదారు రూడీ గియులియానీ చానల్‌పైనా ఆంక్షలు విధించింది. తన చానల్ నుంచి డబ్బు సంపాదించగల సామర్థ్యాన్ని యూట్యూబ్ పరిమితం చేసింది. ఈ నెల 6న యూఎస్ కేపిటల్ భవనం వద్ద జరిగిన అల్లర్ల తర్వాత ట్రంప్ చానల్‌ను యూట్యూబ్ నిలిపివేసింది. తాజాగా, ఇప్పుడా నిషేధాన్ని మరింత పొడిగించింది. కాగా, తమ నిర్ణయంపై గియులియానీ 30 రోజుల్లో కోర్టులో సవాలు చేసుకోవచ్చని యూట్యూబ్ ప్రతినిధి తెలిపారు.