ఇండియాకు వచ్చిన మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్స్!

28-01-2021 Thu 09:22
  • బుధవారం సాయంత్రం ఇండియాకు చేరిక
  • మొత్తం 11కు చేరిన రాఫెల్ విమానాల సంఖ్య
  • డెలివరీ కానున్న మరో 25 విమానాలు
Another 3 Rafele Jets Delivered to India

ఫ్రాన్స్ లో తయారైన మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్స్ ఇండియాకు డెలివరీ అయ్యాయి. ఈ మూడు విమానాలు నిన్న సాయంత్రం ఇండియాకు చేరుకోగా, ఇప్పటికే ఉన్న 8 విమానాలను కూడా కలుపుకుంటే, మొత్తం 11 రాఫెల్ యుద్ధ విమానాలు సైన్యం అమ్ముల పొదిలో ఉన్నట్టు. ఇక ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ విమానాలు మార్గమధ్యంలో ఎక్కడా ఆగలేదు. వీటి ప్రయాణానికి అవసరమైన ఇంధనాన్ని యూఏఈ గగనతలంలో మల్టీ రోల్ ట్యాంకర్ ట్రాన్స్ పోర్ట్ విమానం ద్వారా నింపారు.

కాగా, మొత్తం 36 రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ తో ఇండియా రూ. 59 వేల కోట్ల డీల్ ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత సంవత్సరం జూలై 29న తొలి దశలో ఐదు, ఆపై నవంబర్ లో 3 విమానాలను యుద్ధ విమానాల తయారీ సంస్థ డసో అందించింది. తాజాగా మరో మూడు విమానాలను డెలివరీ చేసింది. డసో నుంచి మరో 25 విమానాలు ఇండియాకు దశలవారీగా రానున్నాయని ఈ సందర్భంగా వాయుసేన ఉన్నతాధికారులు తెలిపారు.

చైనాతో సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విమానాలు వాయుసేన బలాన్ని మరింతగా పెంచుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విమానాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. రాడార్లకు దొరక్కుండా శత్రువులపైకి దూసుకెళ్లడం, అణు బాంబులను మోసుకెళ్లి జార విడవడం వంటి క్లిష్టమైన టాస్క్ లను కూడా ఇవి సునాయాసం చేస్తాయి.