వాకింగ్ కు వెళ్లిన టీడీపీ నేత దారుణ హత్య... జనగామలో తీవ్ర కలకలం!

28-01-2021 Thu 08:45
  • బైక్ పై వచ్చి పులిస్వామిని అడ్డగించిన దుండగులు
  • గొడ్డళ్లతో విచక్షణా రహితంగా నరికివేత
  • గతంలో కౌన్సిల్ గా పనిచేసిన పులిస్వామి
  • ఆ సమయంలో భూ వివాదాలు
TDP Leader Murdered in Janagoan

జనగామలో అందరూ చూస్తుండగానే, వాకింగ్ కు వచ్చిన తెలుగుదేశం పార్టీ స్థానిక నేతను గుర్తు తెలియని దుండగులు గొడ్డళ్లతో నరికి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో జరిగింది. మృతుడు మాజీ కౌన్సిలర్ పులి స్వామి.

రోజులానే, నేటి ఉదయం కూడా ఆయన వాకింగ్ నిమిత్తం బయటకు వచ్చారు. స్థానిక రెసిడెన్షియల్ స్కూల్ వద్ద బైక్ పై వచ్చిన ఇద్దరు ఆయన్ను అడ్డగించారు. వెంట తెచ్చుకున్న గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికారు. దీంతో పులిస్వామి అక్కడికక్కడే నేలకొరిగాడు. ఆపై తాము తెచ్చుకున్న బైక్ ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో నిందితులు దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భూ తగాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, నిందితులను గుర్తించేందుకు సమీపంలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని అన్నారు.