మదనపల్లె హత్యలకు పెద్ద కుమార్తె అలేఖ్య కారణం.. రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలు!

27-01-2021 Wed 21:07
  • మదనపల్లెలో అక్కాచెల్లెళ్ల హత్య
  • తీవ్ర సంచలనం సృష్టించిన ఘటన
  • మూఢ నమ్మకాలతో దారుణం
  • పునర్జన్మలపై నమ్మకమే హత్యలకు కారణం అని భావిస్తున్న పోలీసులు
Remand report of Madanapalle murders

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇటీవల వెలుగుచూసిన జంట హత్యల కేసులో రిమాండ్ రిపోర్టు వెల్లడైంది. ఈ జంట హత్యలకు మూల కారణం పద్మజ, పురుషోత్తంనాయుడుల పెద్ద కుమార్తె అలేఖ్య అని తెలిసింది.  రిమాండ్ రిపోర్టు ప్రకారం అసలేం జరిగిందంటే... ఇటీవల ఓ మంత్రపు ముగ్గును తొక్కినట్టు పద్మజ, పురుషోత్తంనాయుడుల చిన్నకుమార్తె సాయిదివ్య భావించింది. మరుసటి రోజు నుంచి ఆ అమ్మాయి అనారోగ్యంపాలైంది. చనిపోతానేమో అని విపరీతంగా భయపడింది.

అయితే ధైర్యం నింపాల్సిన ఆమె అక్క అలేఖ్య అందుకు భిన్నంగా వ్యవహరించింది. తన చెల్లెలు దివ్యను చనిపోవాలని ప్రోత్సహించింది. ఈ క్రమంలో ఈ నెల 23న భూతవైద్యం చేయించారు. ఆ మరుసటి రోజు దివ్య వింతగా ప్రవర్తించింది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు డంబెల్ తో కొట్టి చంపారు. ఆపై తనను కూడా చంపాలని పెద్ద కుమార్తె అలేఖ్య కోరింది. చెల్లి చనిపోయాక ఏమాత్రం భయపడకుండా తాను కూడా మరణించేందుకు సిద్ధమైంది. తాను కూడా చనిపోయి చెల్లెలిని బతికించి తీసుకొస్తానని తల్లిదండ్రులతో చెప్పింది.

ఆమె అంతకుముందే ఇంట్లోని పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగాలు చేసినట్టు గుర్తించారు. కుక్కను చంపి మళ్లీ బతికించానని తల్లిదండ్రులను కూడా నమ్మించింది. దాంతో వాళ్లు ఏమీ సందేహించకుండా అలేఖ్య మాటలు విన్నారు. చిన్న కుమార్తెపై పునర్జన్మ ప్రయోగం చేసి చంపేశారు. ఇక, పూజల సందర్భంగా అలేఖ్య అరగుండు చేసుకుంది. నోటిలో రాగిచెంబు పెట్టుకుని పూజగదిలో కూర్చుంది. అదే రోజు సాయంత్రం ఐదింటికి ఆమెను కూడా తల్లిదండ్రులు డంబెల్ తో కొట్టి చంపారు. ఓవరాల్ గా పునర్జన్మలపై విశ్వాసమే వారిని ఈ హత్యలకు పురిగొల్పిందని రిపోర్టులో పేర్కొన్నారు.