సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే వరకు వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాకరే

27-01-2021 Wed 20:15
  • పుస్తకావిష్కరణ సభలో మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యలు
  • కర్ణాటకలోని మరాఠా ప్రాంతాలను ఎప్పటికైనా కలిపేసుకుంటామంటూ ఇటీవల ట్వీట్
  • అంగుళం కూడా వదులుకోబోమన్నకర్ణాటక సీఎం
Uddhav Suggestion For Marathi Speaking Areas In Karnataka

కర్ణాటక సరిహద్దులో మరాఠీ భాషను ఎక్కువగా మాట్లాడే ప్రాంతాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మరోమారు స్పందించారు. మహారాష్ట్ర-కర్ణాటక ప్రాంతాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో వచ్చిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఉద్ధవ్ మాట్లాడుతూ.. కర్ణాటక సరిహద్దులో మరాఠీ ఎక్కువగా మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలను సుప్రీంకోర్టు తుదితీర్పు వచ్చే వరకు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసును ఎలాగైనా గెలవాల్సిన అవసరం ఉందన్నారు.

కర్ణాటకలోని మరాఠా ప్రాంతాలను ఎప్పటికైనా కలుపుకుంటామంటూ ఇటీవల ఉద్ధవ్ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఈ వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. ఉద్ధవ్ ట్వీట్‌పై స్పందించిన కర్ణాటక సీఎం యడియూరప్ప అంగుళం భూమిని కూడా వదులుకోబోమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.