ఎర్రకోటను ముట్టడించిన వారు రైతులు కాదు.. వారంతా ఉగ్రవాదులే: కర్ణాటక మంత్రి బీసీ పాటిల్

27-01-2021 Wed 19:57
  • కాంగ్రెస్ పార్టీ నుంచి, పాకిస్థాన్ నుంచి వారికి మద్దతు ఉంది
  • అందుకే చెలరేగిపోతున్నారు
  • ఉగ్రవాదులను, ఖలిస్థానీలను కాంగ్రెస్ పార్టీ తయారుచేస్తోంది
  • నిజమైన రైతులు ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరు
Persons who sieged Red Fort are terrorists says BC Patil

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు నిన్న ఎర్రకోటను ముట్టడించడంపై బీజేపీ నేత, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ తీవ్రంగా స్పందించారు. నిన్న ఎర్రకోట ముట్టడిలో పాల్గొన్న వారు రైతులు కాదని, వారంతా ఉగ్రవాదులని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి, పాకిస్థాన్ నుంచి పూర్తి మద్దతు ఉందన్నారు. వారి మద్దతు బలంతోనే వారు ఎర్రకోటను ముట్టడించారని పేర్కొన్నారు.

నిన్న ఎర్రకోటను ముట్టడించిన వారిలో ఎవరూ రైతుల్లా కనిపించడం లేదని, వారంతా ఉగ్రవాదులేనని పేర్కొన్న మంత్రి.. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదులను, ఖలిస్థానీలను ఆ పార్టీ తయారు చేస్తోందని ఆరోపించారు. రైతుల పేరుతో వారిని ఆందోళనకు ఎగదోసిందన్నారు. నిజమైన రైతులు ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరని, పోలీసులపై దాడులు చేయరని అన్నారు. కాగా, పాటిల్ గతంలోనూ రైతులపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రైతులు పిరికిపందలు కాబట్టే ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.