Nimmagadda Ramesh Kumar: ఇద్దరు అధికారులపై చర్యల గురించి ఓ నేత మాట్లాడారు... కోడ్ అమల్లో ఉన్న విషయాన్ని ఆయన గమనించాలి: నిమ్మగడ్డ

  • ద్వివేది, గిరిజాశంకర్ అభిశంసనపై మాట్లాడిన పెద్దిరెడ్డి
  • లక్ష్మణరేఖ దాటొద్దంటూ హితవు పలికిన నిమ్మగడ్డ
  • పదవీ విరమణ తర్వాత దుగ్గిరాలలో స్థిరపడతానని వెల్లడి
  • దుగ్గిరాలలో తన ఓటు అర్జీ తిరస్కరించారని వివరణ
  • అధికారులపై కోపం లేదన్న ఎస్ఈసీ
Nimmagadda responds to Minister Peddireddy comments

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరపవచ్చంటూ సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వేగం పెంచారు. ఇవాళ ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయిన ఆయన, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ స్వయంగా రమ్మని పిలిచారని, ఎన్నికల నిర్వహణపై అడిగి తెలుసుకున్నారని నిమ్మగడ్డ వెల్లడించారు.

ఈ సందర్భంగా కొన్ని సమస్యలను గవర్నర్ కు విన్నవించానని....  ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వారధిగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. సీఎస్, డీజీపీతో సత్సంబంధాలు ఉన్నట్టు గవర్నర్ కు తెలిపానని, వారిద్దరితో సమన్వయంతో ముందుకు వెళతానని చెప్పానని నిమ్మగడ్డ వివరించారు. సుప్రీం తీర్పు తర్వాత అధికారులు సహకరిస్తున్న అంశాన్ని గవర్నర్ కు తెలియజేశానని చెప్పారు.

ఇక, ఇద్దరు అధికారులపై చర్యల గురించి ఓ నేత మాట్లాడారని పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అంశాన్ని ఆయన గమనించాలని హెచ్చరించారు. నేతలు లక్ష్మణరేఖ దాటొద్దని హితవు పలికారు. అధికారుల నుంచి వచ్చిన సమాధానం తర్వాత ఎన్నికల సంఘం పునరాలోచనలో పడిందని, గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ పై తనకెలాంటి కక్ష లేదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

త్వరలోనే పదవీ విరమణ చేయనున్నానని, పదవీ విరమణ తర్వాత దుగ్గిరాలలో స్థిరపడతానని వెల్లడించారు. హైదరాబాదులో ఉన్న తన ఓటు హక్కును అక్కడే సరెండర్ చేశానని వివరించారు. తాజాగా దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేశానని, అయితే స్థానికంగా నివసించడం లేదని తన అర్జీని తిరస్కరించారని తెలిపారు. ఓటు హక్కు దరఖాస్తును తిరస్కరించినా అధికారులపై కోపం లేదని అన్నారు.

అటు, ఏకగ్రీవాలపై ప్రభుత్వం ప్రకటన ఇవ్వడంపైనా నిమ్మగడ్డ స్పందించారు. ఏకగ్రీవాలపై ప్రకటన ఇచ్చేటప్పుడు ఎస్ఈసీని సంప్రదించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆ పత్రికా ప్రకటను ఐ అండ్ పీఆర్ విభాగం ఇచ్చినట్టు గుర్తించామని, దానిపై ఐ అండ్ పీఆర్ విభాగాన్ని వివరణ కోరతామని పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై అనేక ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు.  ఏకగ్రీవాలకు ఎవరూ అభ్యంతరం చెప్పరని, అయితే ఏకగ్రీవాలు అసంబద్ధ రీతిలో అధికంగా నమోదైతే మాత్రం ఎస్ఈసీ పరిశీలిస్తుందని తెలిపారు. ఎస్ఈసీ విధులకు భంగం కలిగితే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమని పేర్కొన్నారు.

More Telugu News