కరోనా కొత్త స్ట్రెయిన్ ను కట్టడి చేస్తున్న కొవాగ్జిన్... భారత్ బయోటెక్ వెల్లడి

27-01-2021 Wed 17:40
  • బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా
  • జన్యుమార్పిడి చెందిన వైరస్
  • కొవాగ్జిన్ నుంచి తప్పించుకోలేదంటున్న పరిశోధకులు
  • నిపుణులను ఉటంకిస్తూ భారత్ బయోటెక్ ట్వీట్
Bharat Biotech says Covaxin can neutralize new corona strain effectively

కరోనా వైరస్ భూతం బ్రిటన్ లో రూపు మార్చుకుని కొత్త స్ట్రెయిన్ గా వ్యాపిస్తోంది. బ్రిటన్ రకం కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. అయితే, తాము తయారుచేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ బ్రిటన్ రకం కరోనాను కూడా సమర్థంగా ఎదుర్కొంటోందని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. నేషనల్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించిన పరిశోధన తాలూకు లింకును కూడా తన ట్వీట్ లో పంచుకుంది.

కాగా, మామూలు రకం కరోనాపై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో, బ్రిటన్ రకం కరోనా వైరస్ పైనా కొవాగ్జిన్ అంతే సమర్థంగా పనిచేస్తోందని వైరాలజీ నిపుణులు తమ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. బ్రిటన్ రకం కరోనా వైరస్ క్రిములు ఈ వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవచ్చేమో అన్న అనిశ్చితికి స్థానం లేదని తెలిపారు. కాగా, భారత్ లో దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ గా కొవాగ్జిన్ విశిష్ట గుర్తింపు అందుకుంటోంది. కొవాగ్జిన్ డోసులను పెద్ద సంఖ్యలో భారత్ మిత్రదేశాలకు సుహృద్భావపూరితంగా పంపిస్తోంది.