ద్వివేది, గిరిజాశంకర్ లపై అభిశంసన పత్రాన్ని తిరిగి ఎస్ఈసీకి పంపిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి

27-01-2021 Wed 17:22
  • ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాని ద్వివేది, గిరిజాశంకర్
  • అభిశంసన ఉత్తర్వులు జారీ చేసిన నిమ్మగడ్డ
  • వారిద్దరూ విధుల్లో కొనసాగుతున్నారన్న పెద్దిరెడ్డి
  • ఇవి కక్ష సాధింపు చర్యలు అంటూ వ్యాఖ్యలు
Peddireddy Press Meet

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఏపీ పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లను అభిశంసిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాను నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు వారిద్దరూ హాజరుకాకపోవడంతో అభిశంసన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అయితే, ఎస్ఈసీ పంపిన అభిశంసన పత్రాన్ని తాము ఆయనకు తిప్పి పంపాలని నిర్ణయించామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన పెద్దిరెడ్డి... ఎస్ఈసీ నిమ్మగడ్డపై ధ్వజమెత్తారు.

నిమ్మగడ్డ పదవీకాలం మార్చి 31 వరకేనని, ఆ తర్వాత కూడా తమ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ఇప్పటివరకైతే గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ ఇద్దరూ కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి (నిమ్మగడ్డ) ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణ అధికారాలను అడ్డంపెట్టుకుని రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ అధికారులపై కక్షపూరితంగా చర్యలు తీసుకోవడం వెనుక నేపథ్యం ఏంటో అందరికీ తెలిసిందేనని అన్నారు.

గోపాలకృష్ణ ద్వివేది అంటే చంద్రబాబుకు కొండంత అభిమానం అని, అందుకే ఆయన ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుని ద్వివేదిపై చర్యలకు ఆలోచన చేస్తున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. గతంలో ద్వివేది రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా పనిచేశారని, అలాంటి వ్యక్తిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చర్యలు తీసుకోవడాన్ని ఎవరు ఆహ్వానిస్తారు? అంటూ పెద్దిరెడ్డి ప్రశ్నించారు.