అమెరికా, రష్యా మధ్య కీలక అంగీకారం.. ‘స్టార్ట్​’ పొడిగింపునకు అమెరికా ఓకే!

27-01-2021 Wed 14:26
  • ఫిబ్రవరి 5న ముగియనున్న అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం
  • ఐదేళ్లు పొడిగించినట్టు ప్రకటించిన రష్యా
  • దానిని ఇంకా ధ్రువీకరించని అమెరికా
  • కేవలం చర్చలే జరిగాయని శ్వేత సౌధం ప్రకటన
Joe Biden Vladimir Putin talk Kremlin says arms pact has been extended

అమెరికా, రష్యా మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. ఇన్నాళ్లూ ట్రంప్ ఆపేస్తున్న అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ‘స్టార్ట్ (వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం)’ను బైడెన్ ప్రభుత్వం ఐదేళ్లు పొడిగించినట్టు తెలుస్తోంది. దీనిపై రష్యా ప్రకటన విడుదల చేసింది. అయితే, ఒప్పందాన్ని బైడెన్ ప్రభుత్వం పొడిగించిందో లేదో ధ్రువీకరించని శ్వేతసౌధ అధికారులు.. దానిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య చర్చలు జరిగాయని మాత్రం చెప్పారు.

జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. పుతిన్, బైడెన్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారని చెప్పారు. ఫిబ్రవరి 5న గడువు తీరనున్న ఆ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదిరిందన్నారు.  2010లో రెండు దేశాల మధ్య జరిగిన ఆ ఒప్పందం ప్రకారం రెండు దేశాలూ 1,550 చొప్పున అణ్వస్త్రాలను కలిగి ఉండొచ్చు.

కాగా, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై బైడెన్, పుతిన్ సంతృప్తిని వ్యక్తం చేశారని రష్యా ప్రకటించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల ప్రతుల మార్పిడి జరిగిందని చెప్పింది. ఒప్పందం పొడిగింపునకు కావాల్సిన ప్రక్రియపై కొన్ని రోజుల్లో ప్రకటన వెలువడుతుందని చెప్పింది. రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంబంధాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాల్సిందిగా బైడెన్ ను పుతిన్ కోరినట్టు తెలిపింది. ‘ఓపెన్ స్కైస్’ ఒప్పందం నుంచి ట్రంప్ బయటకు రావడంపైనా చర్చించారని ప్రకటించింది.

అయితే, స్టార్ట్ ను ఐదేళ్ల పాటు పొడిగించేందుకు బైడెన్, పుతిన్ మధ్య సూత్రప్రాయ అంగీకారం మాత్రమే కుదిరిందని వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. ఆయుధ నియంత్రణ, ప్రస్తుత భద్రతా సమస్యలపై స్థిరమైన చర్చలు కొనసాగించేందుకూ అంగీకారం కుదిరిందని చెప్పింది. అలాగే, ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంపైనా ఇద్దరూ మాట్లాడుకున్నట్టు పేర్కొంది.

ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి తాము మద్దతుగా నిలుస్తామని అమెరికా తేల్చి చెప్పింది. ఇలాంటి విషయాల్లో రష్యాను ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపింది. రష్యా విమర్శకుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీపై విష ప్రయోగం చేయడాన్ని బైడెన్ తీవ్రంగా తప్పుబట్టినట్టు చెప్పింది.