నా సొంతగడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు స్వాగతం: సుందర్ పిచాయ్

27-01-2021 Wed 14:21
  • చెన్నై చేరుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు
  • భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్
  • ఈ సిరీస్ గొప్పగా ఉంటుందన్న పిచాయ్
  • ట్విట్టర్ లో స్పందించిన గూగుల్ సీఈఓ
Sundar Pichai welcomes England cricket team to for his home town Chennai

భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు చెన్నై చేరుకుంది. టీమిండియాతో తొలి రెండు టెస్టులు చెన్నై వేదికగా జరగనున్నాయి. ఇటీవల శ్రీలంకలో రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనలోనూ విజయం సాధించాలని ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో, ఈ మధ్యాహ్నం చెన్నై చేరుకున్న ఇంగ్లాండ్ జట్టుకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వాగతం పలికారు.

 తన సొంతగడ్డ చెన్నైలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టుకు వెల్కమ్ అంటూ పిచాయ్ ట్వీట్ చేశారు. ఈ సిరీస్ గొప్పగా సాగుతుందని భావిస్తున్నానని తెలిపారు. టెక్ దిగ్గజం గూగుల్ ను నడిపించే బాధ్యతల్లో ఉన్న సుందర్ పిచాయ్ క్రికెట్ కు వీరాభిమాని. ఊపిరి సలపని పని ఒత్తిళ్లలోనూ ఏ కొద్ది సమయం దొరికినా క్రికెట్ మ్యాచ్ లు వీక్షించడానికి ప్రాధాన్యం ఇస్తారు. కాగా, భారత్ లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ 6 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనుంది.