గుడికి వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

27-01-2021 Wed 13:42
  • జీపును వెనుక నుంచి ఢీకొట్టిన ట్రక్కు
  • రాజస్థాన్ లోని టోంక్ వద్ద ఘటన
  • నలుగురికి తీవ్రగాయాలు
  • అందరిదీ మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ పట్టణం
  • కతుశ్యాం ఆలయానికి వెళ్లొస్తుండగా అనుకోని ప్రమాదం
At least eight killed after trailer truck hits jeep in Tonk

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోంక్ జిల్లాలో ఓ జీపును ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున 2.15 గంటలకు నేషనల్ హైవే 12పై జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని జైపూర్ లోని ఆస్పత్రికి తరలించామని, యాక్సిడెంట్ చేసిన ట్రక్కు డ్రైవర్, యాక్సిడెంట్ కు గురైన జీపు డ్రైవరూ పరారయ్యారని టోంక్ డీసీపీ తెలిపారు. జీపులో ప్రయాణిస్తున్న వారిది మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ అని చెప్పారు. రాజస్థాన్ లోని కతుశ్యాం ఆలయానికి వచ్చి.. రాజ్ గఢ్ కు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.

కాగా, ప్రమాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోంక్ రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోయారని తెలిసి చాలా బాధేసిందని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.