అల్లర్లలో 300 మందికి పైగా పోలీసులకు గాయాలు: ఢిల్లీ పోలీసుల వెల్లడి

27-01-2021 Wed 13:05
  • అదనపు డీసీపీపై కత్తితో దాడి చేశారని ప్రకటన
  • ఘటనపై 22 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన పోలీసులు
  • యోగేంద్ర యాదవ్ సహా 9 మంది రైతు సంఘాల నేతలపై కేసు
  • 200 మంది దాకా ఆందోళనకారుల అరెస్ట్
  • ఎర్రకోట వద్ద మరింత కట్టుదిట్టంగా భద్రత
  • ఢిల్లీ సరిహద్దుల్లోనూ మోహరించిన అదనపు బలగాలు
Over 300 Delhi Police personnel injured in tractor rally violence

గణతంత్ర దినోత్సవాన రైతులు చేసిన ట్రాక్టర్ ర్యాలీ ఎంత హింసాత్మకంగా మారిందో తెలిసిందే. బారికేడ్లను ఢీకొట్టేస్తూ.. అడ్డొచ్చిన పోలీసులను తరిమికొడుతూ ఢిల్లీలోకి రైతులు చొచ్చుకొచ్చారు. మువ్వన్నెల జెండా ఎగరాల్సిన ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ జెండాను ఎగరేశారు.

ఈ హింసలో 300 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తాజా ప్రకటన చేశారు. ఐటీవో దగ్గర అదనపు డీసీపీపై రైతులు కత్తి దూశారని, ఆయనకు గాయాలయ్యాయని తెలిపారు. ఘటనకు సంబంధించి 22 ఎఫ్ఐఆర్ లను నమోదు చేశామన్నారు. 200 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. యోగేంద్ర యాదవ్ సహా 9 మంది రైతు సంఘాల నేతల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టు చెప్పారు.

ఘటనకు కారకులైన వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అల్లర్ల నేపథ్యంలో ఎర్రకోట దగ్గర అదనపు బలగాలను మోహరించారు. బందోబస్తును మరింత కట్టుదిట్టం చేశారు. ఇటు రైతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ సరిహద్దుల వద్ద కూడా మరిన్ని బలగాలను రంగంలోకి దించారు.

కాగా, హింస జరిగిన ప్రాంతాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ పరిశీలించారు. నిరసనల్లో చనిపోయిన వ్యక్తిని పోలీసులే తలలో కాల్చి చంపారని వస్తున్న ఆరోపణలపై అధికారులు స్పందించారు. ట్రాక్టర్ తిరగబడి తలకు తీవ్రగాయాలు కావడం వల్లే ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పారు. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టును విడుదల చేశారు.