వాళ్ల నాన్న నిర్మిస్తున్న సినిమాలో కీర్తి సురేశ్!

27-01-2021 Wed 12:40
  • ప్రస్తుతం 'సర్కారు వారి పాట'లో కీర్తి 
  • తండ్రి సురేశ్ కుమార్ నిర్మిస్తున్న 'వాశి'
  • సహనిర్మాతలుగా తల్లి మేనక, సోదరి రేవతి
  • ఈ ఛాన్స్ ఈజీగా రాలేదన్న కీర్తి సురేశ్     
Keerti Suresh to act in her fathers film

తెలుగులో హోమ్లీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుని, ప్రస్తుతం మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కీర్తి సురేశ్ తాజాగా మరో కొత్త చిత్రానికి సంతకం చేసింది. అయితే, ఇలా కొత్త చిత్రం ఒప్పుకోవడంలో విశేషం ఏమీ లేకపోయినప్పటికీ, ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నది వాళ్ల తండ్రే కావడం ఇక్కడ విశేషం. అందుకే, ఈ చిన్నది ఇప్పుడు తెగ ఆనందపడుతోంది.

కీర్తి తాజాగా మలయాళంలో 'వాశి' అనే చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. తోవినో థామస్ హీరోగా నటించే ఈ చిత్రాన్ని కీర్తి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్ కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి కీర్తి తల్లి, మాజీ నటి మేనక, ఆమె సోదరి రేవతి సహనిర్మాతలుగా వ్యవహరిస్తుండడం మరో విశేషం.

"తండ్రి నిర్మించే సినిమాలో నటించగలగడం అనేది ఏ అమ్మాయికైనా అదొక కల లాంటిది. అసలు ఇలా తండ్రి బ్యానర్లో నటించడం అన్నది  చాలా ఈజీ అని చాలామంది వాదిస్తారు. కానీ, కచ్చితంగా చెప్పాలంటే, ఏదీ అంత ఈజీగా రాదు. వాశి సినిమా కార్యరూపం దాల్చడానికి ఏడేళ్లు పట్టింది" అంటూ కీర్తి సురేశ్ ట్వీట్ చేసింది. మరో విశేషం ఏమిటంటే, ఆమె బాల్య స్నేహితుడు విష్ణు రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.