Deep Siddhu: గతంలో మోదీతో కలసి ఫొటోలు దిగిన దీప్ సిద్ధూ... ఇప్పుడు అస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్!

Old Pic Goes Viral Deep Siddhu with Modi
  • దీప్ సిద్ధూ బీజేపీకి చెందిన వ్యక్తే
  • కావాలనే ఉద్యమాన్ని తప్పుదారి పట్టించారు
  • ఆరోపించిన కాంగ్రెస్, ఆప్
నిన్న న్యూఢిల్లీలో జరిగిన అవాంఛిత ఘటనలకు పంజాబీ నటుడు దీప్ సిద్ధూ బాధ్యుడంటూ ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్న వేళ, ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుండగా, విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో అస్త్రం దొరికింది. గతంలో దీప్ సిద్ధూ ప్రధాని నరేంద్ర మోదీతో దిగిన చిత్రాలను ఆ పార్టీ నేతలు వైరల్ చేస్తూ, ఇదంతా బీజేపీయే చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

నిన్న ఎర్రకోటపై సిక్కు నిరసనకారులు తమ జెండాను ఎగురవేస్తున్న వేళ, దీప్ సిద్ధూ ఫేస్ బుక్ లో లైవ్ ఇవ్వడం తీవ్ర కలకలం రేపగా, దీనిపై పోలీసులు దృష్టిని సారించారు. దీప్ సిద్ధూ తన ప్రసంగాలతో రైతులను ఉద్రేకపూరితం చేశారని తెలుస్తుండగా, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఉదయం దీప్ సిద్ధూపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రైతులు, ఆయన్ను తరిమికొట్టగా, ఢిల్లీని వీడి దీప్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

ఇక దీప్ సిద్ధూ బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తేనని కాంగ్రెస్ ఇప్పుడు వాదిస్తోంది. దీప్ సిద్ధూ గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేశారని, ఇప్పుడు రైతుల నిరసనలను తప్పుదారి పట్టించేందుకు అతన్ని రైతు ముసుగులో రంగంలోకి దింపారని ఆప్ నేతలు కూడా ఆరోపించారు. నిన్న జరిగిన ఉద్రిక్త ఘటనల వెనుక బీజేపీ హస్తమే ఉందని అంటున్నారు.

ఎర్రకోట ముట్టడికి సూత్రధారి ఆయనేనని కర్షక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనే తమను ఎర్రకోట దిశగా నడిపించాడని, ఓ యువకుణ్ణి ప్రేరేపించి, సిక్కు మత జెండాను ఎర్రకోటపైకి పంపాడని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) హర్యానా విభాగం నేత గుర్నామ్‌ సింగ్‌ చదౌనీ ఆరోపించారు. అక్కడికి వెళితేనే మన ఆందోళన సక్సెస్ అవుతుందని ఆయన ప్రసంగించాడని అన్నారు.
Deep Siddhu
Congress
Narendra Modi
Old Pic

More Telugu News