విద్యార్థులు లేక వెలవెల‌బోతున్న కృష్ణా జిల్లాలోని ఇంజనీరింగ్‌ కాలేజీలు

27-01-2021 Wed 11:54
  • ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు నిండని వైనం
  • కొన్ని కోర్సుల్లో సీట్ల‌కు ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఆప్ష‌న్లు
  • రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తవుతున్న‌ప్ప‌టికీ భారీ సంఖ్య‌లో మిగిలిన‌ సీట్లు  
no students in engineering colleges

ఏపీలోని కృష్ణా జిల్లాలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు నిండ‌డం లేదు. కొన్ని కోర్సుల్లో సీట్ల‌కు ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఆప్ష‌న్లు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆ బ్రాంచిల్లో త‌ర‌గతుల నిర్వ‌హ‌ణపై సందిగ్ధ‌త నెల‌కొంది. రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తవుతున్న‌ప్ప‌టికీ భారీ సంఖ్య‌లో సీట్లు మిగిలిపోయాయి.

ఉదాహ‌ర‌ణ‌కు జిల్లాలో 32 కాలేజీల్లో ప్రవేశాలకు ప్రభుత్వం అనుమ‌తులు‌ ఇచ్చింది. ఆయా కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద మొత్తం 11,555 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 32 కాలేజీల్లో తొమ్మిందింటిలో వందమంది లోపే విద్యార్థులు చేరారు.

తొలి విడతలో 8,408 మంది సీట్లకు ఆప్ష‌న్లు ఇచ్చారు. అందులోనే చాలా మంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. దీంతో వ‌చ్చేనెల‌ 1 నాటికి విద్యార్థులు కాలేజీల్లో చేరక‌పోతే, సీటు రద్దు చేస్తామని అధికారులు ప్రకటించారు.  

కన్వీనర్‌ కోటాలోనే ఇంకా  2,857 సీట్లు ఖాళీగా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు, మూడేళ్ల పాటు 25 శాతంపైన ప్రవేశాలు లేకుంటే ఆయా కాలేజీల గుర్తింపును ర‌ద్దు చేస్తారు. ఇప్ప‌టికే మ‌చిలీప‌ట్నంలో మూడు కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో మూతపడ్డాయి. మంచి డిమాండ్ ఉండే సీఎస్‌ఈ, మెకానిక‌ల్ బ్రాంచిల‌కు కూడా ఆద‌ర‌ణ త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. ఆయా బ్రాంచిల్లో కొన్ని కాలేజీల్లో అతి త‌క్కువ మంది విద్యార్థులు చేరారు. ప్ర‌స్తుతం ఇంజ‌నీరింగ్ సీట్ల‌కు డిమాండ్ త‌గ్గ‌డంతో ఆయా కాలేజీల ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది.