కోర్టు ఖర్చులకు ప్రియురాలి సోదరుడిని డబ్బు అడిగిన ప్రపంచ రెండో కుబేరుడు జెఫ్​ బెజోస్​!

27-01-2021 Wed 11:36
  • మైఖేల్ తన పరువు తీశాడని ఆరోపించిన అమెజాన్ అధిపతి
  • 17 లక్షల డాలర్లు ఇప్పించాలని కోర్టులో వ్యాజ్యం
  • 2 లక్షల డాలర్ల కోసం నగ్న ఫొటోలను లీక్ చేశాడని ఆరోపణ
  • బెజోస్ విజ్ఞప్తి చాలా చెత్తగా, వింతగా ఉందన్న మైఖేల్ లాయర్
Jeff Bezos seeks 2 million Dollar in legal fees from girlfriends brother

ప్రపంచానికే రెండో అతిపెద్ద కుబేరుడు ఆయన. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులు తీసుకున్న వ్యక్తిగా రికార్డుకెక్కిన సుసంపన్నుడు.. అమెజాన్ సంస్థలకు అధిపతి. అలాంటి వ్యక్తి.. కోర్టు విచారణ కోసం తన ప్రియురాలి సోదరుడి నుంచి 17 లక్షల డాలర్లు (సుమారు రూ.12.38 కోట్లు) ఆశించారట. అన్ని లక్షల కోట్లకు పడగలెత్తిన జెఫ్ బెజోస్ ఏంటి.. జస్ట్ అంత చిన్న మొత్తాన్ని తన ప్రియురాలి సోదరుడిని అడగడమేంటి అని అనుకుంటున్నారా.. అది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాలి మరి.

లారెన్ శాంచెజ్ అనే ఓ న్యూస్ యాంకర్ ను బెజోస్ ప్రేమించారు. నిజానికి అప్పటికే ఆయనకు మెకింజీతో వివాహమైంది. గత ఏడాదే ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. దాదాపు సగం ఆస్తిని ఆమెకు రాసిచ్చేశారు. అయితే, 2019లో లారెన్ తో బెజోస్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు పొక్కాయి. నేషనల్ ఎంక్వైరర్ అనే వార్తా సంస్థ వాటిని ప్రచురించింది. అంతేకాదు.. దీనిపై పెద్ద దుమారమే రేగింది. లారెన్ సోదరుడు మైఖేల్ శాంచెజే ఆ ఫొటోలను లీక్ చేశాడని బెజోస్ ఆరోపించారు.

అయితే, తనను అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగారని ఆరోపిస్తూ బెజోస్, ఆయన సెక్యూరిటీ కన్సల్టెంట్ గవిన్ డి బెక్కర్ పై మైఖేల్ పరువు నష్టం దావా వేశారు. అయితే, ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ కేసును కోర్టు కొట్టేసింది. కోర్టులో కేసు వేసి తన పరువు తీశారని ఆరోపిస్తూ గత శుక్రవారం బెజోస్ కూడా లాస్ ఏంజిలిస్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.  

తమ నగ్న ఫొటోలను 2 లక్షల డాలర్ల (సుమారు రూ.1.45 కోట్లు) కోసం  నేషనల్ ఎంక్వైరర్ కు లీక్ చేశాడని బెజోస్ ఆరోపించారు. తన సోదరి పరువు తీశారన్నారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజేందుకు చూశారని పేర్కొన్నారు. అయితే, కోర్టు కేసు విచారణలకు అయ్యే ఖర్చును మైఖేల్ నుంచి ఇప్పించాలని కోర్టును కోరారు. అయితే, బెజోస్ విజ్ఞప్తి చాలా చెత్తగా, వింతగా ఉందని మైఖేల్ శాంచెజ్ తరఫు న్యాయవాది టామ్ వారెన్ అన్నారు.