Corona Virus: కరోనా టీకా ఎక్స్‌పైరీ గడువు ఆరు నెలలే.. ఆ లోపే వినియోగించాలి: నిపుణులు

Expiry date of corona vaccine is only 6 months
  • దేశంలో పెరుగుతున్న టీకాల ఉత్పత్తి
  • ఇప్పటికే పెద్ద ఎత్తున టీకా నిల్వలు
  • గడువులోపు వినియోగించకుంటే మురిగిపోయే ప్రమాదం
  • ఎక్స్‌పైరీ గడువును ఏడాదికి పెంచే ప్రయత్నం
కరోనా వైరస్ పీచమణచేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత చురుగ్గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిపుణులు కీలక సూచన చేశారు.

అందుబాటులో ఉన్న టీకాలను సత్వరమే వినియోగించాలని సూచించారు. వాటి ఎక్స్‌పైరీ గడువు 6 నెలలు మాత్రమే ఉంటుందని, కాబట్టి వీలైనంత త్వరగా అందరికీ టీకాలు వేయాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాల వినియోగానికి గడువు అవి తయారైనప్పటి నుంచి ఆరు నెలలు మాత్రమేనని చెబుతున్నారు.

మన దేశంలో ప్రస్తుతం రెండు కంపెనీల టీకాలను తొలి దశలో ఇస్తున్నారు. ఇందులో ఓ కంపెనీ ఇప్పటికే 2 కోట్ల డోసులను ప్రభుత్వానికి అందించింది. మరో 60 లక్షల డోసులు కంపెనీ వద్ద ఉన్నాయి. మరో సంస్థ వద్ద కూడా 2 కోట్ల డోసులు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 16న దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 20 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు.

అందుబాటులో ఉన్న టీకాలను ఆరు నెలల లోపు వినియోగించుకోలేకపోతే అవన్నీ ఎందుకూ కొరగాకుండా పోతాయి. ఈ నేపథ్యంలో టీకా వినియోగ గడువును తయారీ తేదీ నుంచి గరిష్ఠంగా ఏడాదిపాటు ఉండేలా చూడాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఇందుకోసం పరిశోధనలు ప్రారంభించాయి. శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఫలిస్తే మానవాళికి మరింత మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
Corona Virus
Vaccination
Bharat Biotech
COVAXIN
Covishield
expiry date

More Telugu News