18 ఏళ్ల త‌ర్వాత పాక్ జైలు నుంచి విడుద‌ల.. భార‌త్ కు చేరిన మ‌హిళ‌

27-01-2021 Wed 10:11
  • భార‌త్ కు వ‌చ్చిన‌ ఔరంగా‌బాద్‌కు చెందిన హ‌సీనా బేగం(65)
  • త‌న‌ భ‌ర్త బంధువులను చూసేందుకు పాక్‌కు వెళ్లిన హ‌సీనా
  • పాస్‌పోర్టును లాహోర్‌లో పోగొట్టుకున్న వైనం
  • అప్ప‌ట్లో అరెస్టు చేసిన పోలీసులు
woman reached india after 18 years

పాకిస్థాన్ జైల్లో 18 సంవ‌త్స‌రాల పాటు శిక్ష అనుభ‌వించిన ఓ భార‌తీయ మ‌హిళ తాజాగా విడుద‌లైంది. ఔరంగా‌బాద్‌కు చెందిన హ‌సీనా బేగం(65) అప్ప‌ట్లో త‌న‌ భ‌ర్త బంధువులను చూసేందుకు పాక్‌కు వెళ్లింది. అయితే, ఆమె పాస్‌పోర్టు లాహోర్‌లో పోగొట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఆమెను  అక్క‌డి పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు త‌ర‌లించారు. దీంతో ఆమె బంధువులు ఫిర్యాదు చేయ‌డంతో పాక్‌ పోలీసుల‌కు ఔరంగాబాద్ పోలీసులు లేఖ రాశారు.

ఆమె పాక్‌లో జైలులోనే ఉంద‌ని అక్క‌డి పోలీసులు తెలిపారు. ఆమెను తీసుకురావడానికి ఔరంగా‌బాద్ పోలీసులు ఇన్నాళ్లు ప్ర‌య‌త్నాలు జ‌రిపారు. చివ‌ర‌కు పాక్ ఆమెను విడుద‌ల చేసింది. సొంత దేశానికి  రావ‌డంతో త‌న‌కు ఇప్పుడు స్వ‌ర్గంలో ఉన్న‌ట్టు ఉందని హ‌సీనా బేగం తెలిపింది. తాను పాకిస్థాన్‌లో ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొన్నానని చెప్పింది. తాను తిరిగి భార‌త్‌కు రావ‌డానికి సాయం చేసిన‌ ఔరంగాబాద్ పోలీసుల‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.