USA: ట్రంప్ ను అభిశంసించేంత బలం తన వద్ద లేదని తెలుసుకున్న జో బైడెన్!

  • ప్రస్తుతం సెనెట్ లో 50-50 బలం
  • అభిశంసన జరగాలంటే మూడింట రెండొంతుల ఓట్లు అవసరం
  • ట్రంప్ పై విచారణ మాత్రం కొనసాగుతుందన్న బైడెన్
Biden Acknoledges that his Party Not Enough Strength to Impeach Trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అభిశంసించేందుకు సరిపడా ఓట్ల బలం సెనేట్ లో తమకు లేదని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గుర్తించారని అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. వాస్తవానికి ట్రంప్ పై అభిశంసనకు బైడెన్ పూర్తి సుముఖంగా లేరనే చెప్పాలి. అయితే, ఎన్నికల తరువాత నెలకొన్న పరిస్థితులు, ట్రంప్ పై అభిశంసన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టేలా చేయగా, డెమొక్రాట్లకు బలం అధికంగా ఉన్న సభలో తీర్మానం నెగ్గింది. ఆపై ఇది సెనేట్ ముందుకు రాగా, వచ్చే నెల 8 నుంచి సెనెట్ లో విచారణ జరుగనుంది.

కానీ, ప్రస్తుతం సెనెట్ లో అభిశంసన తీర్మానం నెగ్గేంత బలం డెమొక్రాట్లకు లేదనే చెప్పాలి. తాజాగా, సీఎన్ఎన్ తో బైడెన్ మాట్లాడుతూ, "నేను వచ్చినప్పటి నుంచి సెనేట్ కొంచెం మారింది. అయితే, అదేమీ ప్రభావం చూపేంతగా కాదు" అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఏదిఏమైనా, ట్రంప్ పై విచారణ కొనసాగుతుందని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తి చేసిన తప్పులపై మాట్లాడాల్సిందేనని, ఆపై ఏం జరుగుతుందో చూడాలని అన్నారు.

ఇక అభిశంసన తీర్మానంపై చర్చ రాజకీయ కోణంలో సాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ను మరోసారి ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలంటే, సెనేట్ లో మూడింట రెండొంతుల మంది సభ్యులు అనుకూలంగా ఉండాలి. మొత్తం 100 మంది సభ్యులున్న సెనేట్ లో ప్రస్తుతం రెండు పార్టీలకూ చెరో 50 మంది సభ్యులున్నారు. రిపబ్లికన్ల నుంచి ట్రంప్ ను వ్యతిరేకిస్తున్న కొందరు సభ్యులు అభిశంసనకు అనుకూలంగా ఓటేసినా, తీర్మానం ఆమోదం పొందేందుకు అవసరమైన 67కు పైగా ఓట్లను సాధించడం దాదాపు అసాధ్యమేనని తెలుస్తోంది.

ఇదిలావుండగా, షెడ్యూల్ ప్రకారం, మంగళవారం జ్యూరీ సభ్యులుగా డెమొక్రాట్, రిపబ్లికన్ నేతలు ప్రమాణం చేసిన తరువాత ట్రంప్ కు అధికారికంగా సమన్లు పంపుతారు. ఆపై 8వ తేదీన అధికారికంగా చర్చ మొదలవుతుంది. దీన్ని వెర్మాంట్ సెనెటర్ పాట్రిక్ లీహే ప్రారంభిస్తారు. సెనెట్ లో ఆయనే అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన నేత కావడం గమనార్హం. ఇదే సమయంలో తనకు ఎదురు కానున్న పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ట్రంప్ ఇప్పటికే మాజీ అధ్యక్షుడి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కేంద్రంగా ఈ కార్యాలయం ఏర్పడింది.

More Telugu News