మరో ఆల్ టైమ్ రికార్డుకు 'పెట్రో' ధరలు!

27-01-2021 Wed 09:39
  • ఆకాశాన్ని అంటుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు
  • తాజాగా మరో 36 పైసల పెంపు
  • ముంబైలో రూ. 93.62కు పెట్రోలు ధర
Another Record in Petrol Price

ఇటీవలి కాలంలో రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు నేడు కూడా పెరిగి మరో ఆల్ టైమ్ రికార్డును అధిగమించాయి. నేడు లీటరు పెట్రోలుపై 36 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి.

ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా ముంబైలో పెట్రోలు ధర ఉండగా, డీజిల్ విషయంలో జైపూర్ ముందుంది. జైపూర్ లో లీటరు పెట్రోలు ధర రూ. 93.60కి చేరింది. ఇదే సమయంలో డీజిల్ ధర రూ. 85.67కు చేరుకుంది. జైపూర్ తరువాత ముంబయిలో పెట్రోలు ధర రూ. 93.62కు, డీజిల్ ధర రూ. 83.03కు చేరుకుంది. ఇక హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 83.19కి చేరుకుంది.

కాగా, ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరాకపోవడంతోనే ధరలను సవరించాల్సి వస్తోందని చమురు కంపెనీలు చెబుతుండగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారాన్ని తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.