VK Sasikala: నేడు విడుదల కానున్న శశికళ.. ఆసుపత్రి నుంచే ఇంటికే!

  • నాలుగేళ్ల శిక్షను పూర్తి చేసుకున్న శశికళ
  • ఆసుపత్రిలోనే విడుదలకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసే యోచన
  • విడుదలైనా మరో పది రోజులు ఆసుపత్రిలోనే
  • వచ్చే నెల మొదటి వారంలో విడుదల కానున్న ఇళవరసి
VK Sasikala To Be Freed From Jail After 4 Years Today

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను పూర్తిచేసుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ నేడు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. కరోనా బారినపడిన శశికళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆసుపత్రిలోనే ఆమె విడుదలకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తిచేస్తారని సమాచారం. శశికళ విడుదల అయినప్పటికీ మరికొంత కాలం ఆసుపత్రిలోనే ఉండి కొవిడ్‌కు చికిత్స తీసుకుంటారని చెబుతున్నారు.

ఈ నెల 20న కరోనా బారినపడిన శశికళను తొలుత బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కొవిడ్-19 సెంటర్ అయిన విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెలో కరోనా లక్షణాలు లేనప్పటికీ మరికొంతకాలం ఆసుపత్రిలోనే ఉంటారని తెలుస్తోంది. వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆమె డిశ్చార్జ్‌పై స్పష్టత వస్తుందని శశికళ మేనల్లుడు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకె) వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్ పేర్కొన్నారు.

శశికళ మరో 10 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని విక్టోరియా ఆసుపత్రి వర్గాలు చెబుతుండగా, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం జైలు నుంచి విడుదలైన వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రూ. 66 కోట్ల అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళకు ఫిబ్రవరి 2017లో కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమె వదిన ఇళవరసి ఫిబ్రవరి మొదటి వారంలో జైలు నుంచి విడుదల కానున్నారు.

More Telugu News