హైదరాబాదులో సీరియల్ కిల్లర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

26-01-2021 Tue 21:57
  • కల్లు దుకాణాల వద్దకు వచ్చే మహిళలే లక్ష్యం
  • నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి హత్య
  • విలువైన వస్తువుల దోపిడీ
  • నిందితుడిపై పదుల సంఖ్యలో కేసులు
Hyderabad police arrests serial killer

కల్లు దుకాణాల వద్దకు వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్న సీరియల్ కిల్లర్ ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. అతడి పేరు ఎం.రాములు. వయసు 45 సంవత్సరాలు.

 హైదరాబాదులోని బోరబండ వాసి. కార్మికుడిగా పనిచేసే రాములు కల్లు కాంపౌండ్ల వద్ద తిరుగుతూ అక్కడికి వచ్చే మహిళలతో పరిచయం పెంచుకుని వారిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి హత్య చేసేవాడు. ఆపై వారివద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకునేవాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు.

సిద్ధిపేట, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో చోటు చేసుకున్న రెండు హత్యల కేసుల్లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకుముందు అతడిపై 21 కేసులు ఉండగా, వాటిలో 16 హత్య కేసులే కావడం గమనార్హం.