ఇంటి యజమానురాలి దుస్తులు కొట్టేసి.. ఇన్ స్టాగ్రామ్ పోస్టుతో దొరికిపోయిన పనిమనిషి!

26-01-2021 Tue 20:13
  • దుబాయ్ లో దొంగతనం
  • పనిచేస్తున్న ఇంట్లోనే చిల్లర దొంగతనాలు చేసిన మహిళ
  • యజమానురాలి దుస్తులు ధరించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
  • ఫొటోలు చూసి అవి తన భార్య దుస్తులని గుర్తించిన భర్త
  • పోలీసులకు ఫిర్యాదు
Women caught after she posted in Instagram

ఫిలిప్పీన్స్ కు చెందిన ఓ మహిళ చేసిన దొంగతనం సోషల్ మీడియా పుణ్యమా అని బట్టబయలైంది. ఆ మహిళ దుబాయిలోని ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. ఆమెకు ఆ ఇంట్లోనే ఓ గదిలో వసతి కల్పించారు. అయితే తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన చందంగా ఆ పనిమనిషి ఇంటి యజమానురాలి దుస్తులు కొట్టేసింది. ఆ దుస్తులను ధరించి బాగా ముస్తాబై ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పంచుకుంది.

ఈ ఫొటోలు కాస్తా ఆ ఇంటి యజమానురాలి భర్త కంటపడ్డాయి. ఇన్ స్టాగ్రామ్ లో కనిపిస్తున్నది తమ ఇంటి పనిమనిషి అని నిర్ధారించుకున్న అతడు ఆమె ధరించిన దుస్తులు తన భార్యవేనని తెలుసుకున్నాడు. ఇదే విషయం భార్యతో చెప్పగా, తన దుస్తులు కొన్నిరోజులుగా కనిపించడంలేదని వెల్లడించింది. దాంతో పనిమనిషి గదిని తనిఖీ చేయగా, తమ దుస్తులతో సహా కనిపించకుండా పోయిన అనేక వస్తువులు బయటపడ్డాయి. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ దొంగ పనిమనిషిని అరెస్ట్ చేశారు.