ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.3 శాతం: ఐరాస నివేదిక

26-01-2021 Tue 15:15
  • కరోనాతో గతేడాది 9.6 శాతం తగ్గుదల
  • ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 4.7% ఉంటుందని అంచనా
  • నిరుద్యోగం భారీగా పెరిగిందని నివేదికలో వెల్లడి
  • 27% నిరుద్యోగ రేటుతో నైజీరియా ప్రథమ స్థానం
  • భారత్ లో 23 శాతం పెరిగిన నిరుద్యోగం
Indian economy estimated to grow at 7 in 2021

కరోనా కారణంగా భారత ఆర్థిక వృద్ధి 2020లో 9.6 శాతం పడిపోయిందని, కానీ, 2021లో పుంజుకుంటుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (యూఎన్ డీఈఎస్ఏ) వెల్లడించింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 7.3 శాతం పెరుగుతుందని పేర్కొంది. మళ్లీ 2022లో 5.6 శాతానికి తగ్గుతుందని తెలిపింది. మంగళవారం ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై నివేదికను విడుదల చేసింది. కరోనాతో గతేడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి 4.3 శాతం పడిపోయిందని, ఈ ఏడాది అది 4.7 శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

కరోనా మోసుకొచ్చిన సామాజిక ఆర్థిక ప్రభావం కొన్నేండ్ల పాటు ఉంటుందని, ఈ ప్రభావం ఉండకూడదంటే ఆర్థిక, సామాజిక రంగాల్లో తెలివిగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని చెప్పింది. 2019లో 4.7 శాతంగా ఉన్న భారత వృద్ధి రేటు.. కరోనా కారణంగా 2020లో 9.6 శాతం తగ్గిందని చెప్పింది. లాక్ డౌన్ తో గృహ వినియోగం భారీగా పడిపోయిందని తెలిపింది. అయితే, ఈ ఏడాది మాత్రం ఏ దేశంలో లేనంతగా 7.3 శాతం మేర భారత వృద్ధి నమోదవుతుందని, 7.2 శాతంతో తర్వాతి స్థానంలో చైనా వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ఇక, దక్షిణాసియాకు సంబంధించి 6.9 శాతం వృద్ధి నమోదవుతుందని వెల్లడించింది.  

కరోనా కారణంగా ప్రపంచంలోని 270 కోట్ల మంది ఉద్యోగులపై పెను ప్రభావం పడిందని నివేదికలో ఐరాస పేర్కొంది. నిరుద్యోగ రేటు భారీగా పెరిగిందని చెప్పింది. నైజీరియాలో అత్యధికంగా 27 శాతం, ఆ తర్వాత భారత్ లో 23 శాతం మేర నిరుద్యోగ రేటు నమోదైందని వెల్లడించింది. కొలంబియాలో 21 శాతం నిరుద్యోగ రేటు రికార్డ్ అయిందని వెల్లడించింది.