అమెరికా అధ్యక్షుడు బైడెన్​ ఆఫీసులో చందమామ రాయి ‘143’!

26-01-2021 Tue 14:47
  • ఓవల్ ఆఫీసులో పెట్టించుకున్న అధ్యక్షుడు
  • మునుపటి తరాల విజయాలను చాటి చెప్పేందుకేనంటున్న అధికారులు
  • 1972 అపోలో మిషన్ ద్వారా ఆ రాయిని భూమి మీదకు తెచ్చిన నాసా
Moon rock from 1972 adorns US President Joe Bidens Oval Office

1972 డిసెంబర్ 19.. ఓ అపురూపమైన ఘట్టం ఆవిష్కృతమైన రోజు అది. చంద్రుడి రాతి నమూనాలను భూమి మీదకు అపోలో 17 తీసుకొచ్చిన రోజు. అప్పటి నుంచి ఆ రాయిని నాసా భద్రంగా దాచి పెట్టింది. 2,819 గ్రాముల (2.8 కిలోలు) బరువున్న రాయిని చిన్న ముక్కలుగా కోసింది. అందులో ఒక రాయి ‘143’. ఇప్పుడు దీని గురించి ప్రస్తావన ఎందుకంటే.. ఆ చందమామ రాతి ముక్కను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఓవల్ ఆఫీసులో పెట్టించారు మరి.

మునుపటి తరాల లక్ష్యాలు, సాధించిన విజయాలు ఎంతటి మహోన్నతమైనవో అందరికీ చాటి చెప్పేందుకు బైడెన్ 333 గ్రాములున్న ఆ రాయిని తెప్పించి పెట్టించారు. అంతేగాకుండా నాసా చేపట్టబోతున్న తదుపరి జాబిల్లి, అంగారక ప్రయోగాలకు మద్దతుగా కూడా దానిని అధ్యక్షుడు తెప్పించుకున్నారని నాసా చెప్పింది. ‘143’ని బెన్ ఫ్రాంక్లిన్ చిత్రపటానికి పక్కన ఏర్పాటు చేసిన బుక్ కేస్ కింది షెల్ఫ్ లో ఓ గ్లాస్ కేసులో పెట్టారు.

కాగా, చందమామ రాయిని ఆఫీసులో పెట్టించుకున్నందుకు అధ్యక్షుడు బైడెన్ కు స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం డైరెక్టర్ ఎలెన్ స్టోఫాన్ కృతజ్ఞతలు చెప్పారు. కాగా, ఈ రాతి నమూనా చంద్రుడి నమూనాల్లోనే అత్యంత విశిష్టమైనదని నాసా ప్రతినిధి చెప్పారు. కాగా, వైట్ హౌస్ లో పెట్టడానికి ముందు ‘143’ని బెర్లిన్ లోని జెర్మన్ మ్యూజియం ఆఫ్ టెక్నాలజీలోనూ ప్రదర్శనకు పెట్టడం విశేషం.