2 అంగుళాల ఎత్తు పెరిగేందుకు రూ.55 లక్షలు ఖర్చు చేసిన కుర్రాడు!

26-01-2021 Tue 14:25
  • పొడవు పెరగాలని భావించిన అమెరికా యువకుడు
  • బాస్కెట్ బాల్ క్రీడాకారుడిలా తయారవ్వాలని కలలు
  • సర్జరీ నిర్వహించిన డాక్టర్ కెవిన్
  • గతంలో 5.11 అడుగుల ఎత్తున్న ఫ్లోర్స్
  • సర్జరీ తర్వాత 6.1 అడుగుల ఎత్తుకు చేరిన వైనం
American man spends lakhs to gain more height

ఒడ్డూ, పొడుగుతో అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకోనిదెవ్వరు చెప్పండి! ఈ అమెరికా యువకుడు కూడా కాస్త పొడవుంటే బాగుండేదని భావించాడు. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా సర్జరీ చేయించుకున్నాడు. అతడి పేరు ఆల్ఫోన్సో ఫ్లోర్స్. టెక్సాస్ లో నివసించే ఫ్లోర్స్ వయసు 28 సంవత్సరాలు. సర్జరీకి ముందు అతడి ఎత్తు 5.11 అడుగులు. కానీ బాస్కెట్ బాల్ క్రీడాకారుడిలా ఎత్తుగా ఉండాలని కలలు కన్న ఫ్లోర్స్ కు తన హైట్ సరిపోదని అర్థమైంది.

దాంతో మరికాస్త పొడవు పెరిగేందుకు నిర్ణయించుకుని ఓ చేయి తిరిగిన కాస్మెటిక్ సర్జరీ నిపుణుడ్ని కలిశాడు. లాస్ వేగాస్ లోని ది లింబ్ ప్లాస్ట్ ఎక్స్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన డాక్టర్ కెవిన్ విజయవంతంగా సర్జరీ నిర్వహించాడు. అందుకై ఖర్చు రూ.55 లక్షలు. ఆపరేషన్ తర్వాత ఫ్లోర్స్ 6.1 అడుగుల హైట్ కు చేరుకున్నాడు. కాగా, ఈ సర్జరీలో ఎముక పొడవు పెంచారట. తద్వారా అధిక ఎత్తు సాధ్యమైంది.

శస్త్రచికిత్స చేయించుకునే క్రమంలో ఫ్లోర్స్ కు అతడి కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ ధైర్యం చేసి సర్జరీ చేయించుకుని తాను కోరుకున్న హైట్ పొందాడు. అయితే అధిక ఎత్తు కోసం నిర్వహించే శస్త్రచికిత్సలు అన్ని సమయాల్లో విజయవంతం అవుతాయని చెప్పలేం. అప్పట్లో హైదరాబాదులో నిఖిల్ రెడ్డి అనే యువకుడు ఇలాగే పొడవు పెరిగేందుకని సర్జరీ చేయించుకుని తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నాడు.