చరిత్ర సృష్టించిన భారత మహిళా పైలెట్లు... గణతంత్ర దినోత్సవాన అరుదైన ఘనత

26-01-2021 Tue 13:47
  • ఎర్రకోటపై రిపబ్లిక్ డే వేడుకలు
  • తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకల్లో మహిళా పైలెట్లు 
  • వేడుకల్లో పాలుపంచుకున్న భావన, స్వాతి
  • గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి అంబరాన్నంటిన అతివలు
First time women pilots took part in Republic day celebrations

భారత వాయుసేన చరిత్రలో ఇవాళ చిరస్మరణీయ ఘట్టం నమోదైంది. భారత గణతంత్ర దినోత్సవాల్లో తొలిసారిగా ఇద్దరు మహిళా పైలెట్లు పాల్గొన్నారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ భావన కాంత్ (28), ఫ్లైట్ లెఫ్టినెంట్ స్వాతి రాథోర్ (28) ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. భావనా కాంత్ వాయుసేన శకటంపై దర్శనమివ్వగా, స్వాతి హెలికాప్టర్ తో విన్యాసాలు చేశారు. భావన యుద్ధ విమాన పైలెట్ కాగా, స్వాతి రాథోర్ హెలికాప్టర్ పైలెట్.

భారత వాయుసేనలో ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాలో పనిచేస్తున్న భావన కాంత్ ప్రస్తుతం రాజస్థాన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె మిగ్-21 బైసన్ యుద్ధవిమానాలు నడపడంలో దిట్ట. సాహస పైలెట్ అభినందన్ వర్ధమాన్ కూడా ఇవే విమానాలు నడిపేవాడు. స్వాతి ఎన్సీసీ నేపథ్యం నుంచి వచ్చారు. కాగా, భావన, స్వాతి ఇద్దరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే. భావన బీహార్ లోని దర్భంగా ప్రాంతం నుంచి వచ్చారు. స్వాతి స్వస్థలం రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా. గతంలో ఏ మహిళా పైలెట్ కు రిపబ్లిక్ డే పరేడ్ లో ఫ్లై పాస్ట్ నిర్వహించే అవకాశం రాలేదు.