ఢిల్లీలో పోలీసుల‌పై క‌ర్ర‌ల‌తో రైతుల దాడి.. ప్రాణ‌భ‌యంతో పోలీసుల ప‌రుగులు.. వీడియోలు ఇవిగో

26-01-2021 Tue 13:40
  • సెంట్ర‌ల్ ఢిల్లీ ఐటీవో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త‌త‌
  • బారికేడ్లను తొలగించిన రైతులు
  • పోలీసు వాహ‌నం ధ్వంసం
  • ఓ బ‌స్సు కూడా ధ్వంసం
Protesters break barricade attack police personnel and vandalise police vehicle

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ‌ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప‌లు ప్రాంతాల్లో  బారికేడ్లను తొలగించి వెళ్లేందుకు రైతులు ప్ర‌య‌త్నించ‌డంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో సెంట్ర‌ల్ ఢిల్లీ ఐటీవో ప్రాంతంలో రైతులు ఒక్క‌సారిగా క‌ర్ర‌ల‌తో పోలీసుల వెంట ప‌డ‌డంతో పోలీసులు ప్రాణ‌భ‌యంతో ప‌రుగులు తీశారు. బారికేడ్ల‌ను తెంచుకుని రైతులు ముందుకు చొచ్చుకెళ్లారు. అక్క‌డున్న పోలీసు వాహ‌నాన్ని ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. అదే ప్రాంతంలో అడ్డుగా నిలిపిన ఓ బ‌స్సును కూడా రైతులు ధ్వంసం చేశారు.

ఓ గ్రూపుకు చెందిన రైతులు ఓ పోలీసుపై దాడి చేస్తుండ‌డంతో మ‌రికొంద‌రు రైతులు పోలీసును ర‌క్షించి ప‌క్క‌కు పంపించారు. నంగ్లోయి ప్రాంతంలో రైతుల‌ను అడ్డుకునేందుకు పోలీసులు రోడ్డుపై అడ్డంగా కూర్చున్నారు. ప‌లు ప్రాంతాల్లో రైతులు, పోలీసుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రుగుతోంది.