హైద‌రాబాద్ శివారులో ఇంట‌ర్ అమ్మాయి అదృశ్యం.. కిడ్నాప్ చేశార‌న్న త‌ల్లిదండ్రులు

26-01-2021 Tue 13:27
  • నిన్న ఉదయం సూపర్ మార్కెట్‌కు వెళ్లిన అమ్మాయి
  • తిరిగి ఇంటికి రాని వైనం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు    

హైద‌రాబాద్ శివారులోని మణికొండలో ఇంటర్ విద్యార్థిని క‌న‌ప‌డ‌కుండా పోయింది. త‌మ కూతురు నిన్న ఉదయం సూపర్ మార్కెట్‌కు వెళ్లింద‌ని, తిరిగి ఇంటికి రాలేదని ఆమె త‌ల్లిదండ్రులు చెప్పారు. నిన్న‌ సాయంత్రం వరకూ ఆమె కోసం ఎదురుచూశామ‌ని, అన్ని ప్రాంతాల్లో వెతికామ‌ని తెలిపారు.

అయిన‌ప్ప‌టికీ ఆమె క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో బంధువుల‌కు కూడా ఫోన్ చేసి  కూతురు వ‌చ్చిందా? అన్న విష‌యంపై ఆరా తీశామ‌ని తెలిపారు. ఆమె బంధువుల ఇంటికీ వెళ్ల‌లేద‌ని తెలుసుకుని చివ‌ర‌కు పోలీసులకు ఫిర్యాదు చేశామ‌ని వివ‌రించారు. తమ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు భావిస్తున్నారు.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.