ఆత్మ రక్షణ కోసం అమ్మాయిలు ఎవరినైనా చంపొచ్చు: మెట్రోపాలిటన్​ లీగల్​ సర్వీసెస్​ అథారిటీ సెక్రటరీ

26-01-2021 Tue 11:59
  • అది నేరం కాదని చట్టంలో ఉందన్న రాధాకృష్ణ చౌహాన్
  • బాలికలు ఎప్పుడూ పెప్పర్ స్ప్రే తీసుకెళ్లాలని సూచన
  • మహిళలకు రక్షణ కల్పించే చట్టాల వివరణ
Girls can kill in selfdefence says expert

ఆత్మ రక్షణ కోసం అమ్మాయిలు ఎవరినైనా చంపొచ్చని, అది వాళ్లకు చట్టం కల్పిస్తున్న హక్కుల్లో ఒకటని మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎంఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎం రాధాకృష్ణ చౌహాన్ అన్నారు. చట్టంలో చెప్పిన దాని ప్రకారం ఆత్మరక్షణ కోసం ఎవరినైనా ఓ అమ్మాయి చంపేస్తే అది నేరం కాబోదన్నారు. హైదరాబాద్ గోల్కొండలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

బాలికలు, మహిళలకు రక్షణగా నిలుస్తున్న కొన్ని చట్టాలను ఆయన వివరించారు. బాలికలు ఎప్పుడూ తమ వెంట పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లాలని సూచించారు. వివిధ రంగాలకు చెందిన గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాలని, వారు చెప్పిన విషయాలను రోజువారీ జీవితంలో ఆచరించాలని  సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏమాత్రం తీసిపోరని అన్నారు.