అందుకే, విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా చేయాల‌ని భావిస్తున్నాం.. 3 రాజ‌ధానులు అవ‌స‌రం: ఏపీ గ‌వ‌ర్న‌ర్

26-01-2021 Tue 10:54
  • అభివృద్ధి కేంద్రీక‌ర‌ణ వ‌ల్ల‌ గ‌తంలో ఇబ్బందులు
  • ప్రాంతీయ అస‌మాన‌త‌లు త‌లెత్తాయి
  • క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా చేయాల‌నుకుంటున్నాం
  • అమ‌రావ‌తి శాస‌న‌రాజ‌ధానిగా ఉంటుంది
ap needs 3 capitals says governor

విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వ‌హించిన‌ 72వ గణతంత్ర వేడుకల సంద‌ర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ప్ర‌సంగించారు. అభివృద్ధి కేంద్రీక‌ర‌ణ గ‌తంలో ఇబ్బందులు సృష్టించింద‌ని పేర్కొన్నారు. దాని వ‌ల్ల ప్రాంతీయ అస‌మాన‌త‌లు త‌లెత్తాయ‌ని చెప్పారు.

అందుకే, ఏపీ ప్ర‌భుత్వం అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌ను కీల‌కంగా భావిస్తోంద‌ని చెప్పారు. ప్రాంతీయ స‌మాన‌త‌ల కోసం మూడు రాజ‌ధానులు అవ‌స‌ర‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా చేయాల‌ని భావిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా చేయాల‌నుకుంటున్నామ‌ని చెప్పారు. అమ‌రావ‌తి శాస‌న‌రాజ‌ధానిగా ఉంటుందని  బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు.

రాష్ట్రంలో పేద‌ల సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని, ఇళ్ల ప‌థ‌కానికి రూ.28,084 కోట్లు ఖ‌ర్చుచేసింద‌ని వివరించారు. రూ.23,535 కోట్ల విలువైన భూముల‌ను పేద‌ల‌కు ఇచ్చిన‌ట్లు చెప్పారు. రైతుల భ‌రోసా కింద రూ.13,101 కోట్లు అందించిన‌ట్లు తెలిపారు. 2 ల‌క్ష‌ల బోర్ల ద్వారా కొత్త‌గా 5 ల‌క్ష‌ల ఎక‌రాల పంట‌ల‌ను సాగులోకి తెస్తామ‌ని ఆయ‌న చెప్పారు. పాడి రైతుల కోస‌మే అమూల్‌తో త‌మ ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంద‌ని తెలిపారు.

ఇక అమ్మఒడి ద్వారా త‌ల్లుల ఖాతాల్లో రూ.13,121 కోట్లు వేసిన‌ట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2,436 జ‌బ్బుల‌కు చికిత్సలు అందిస్తున్నామ‌ని చెప్పారు. రూ.16,300 కోట్ల‌తో ప‌లు ఆసుప‌త్రుల నిర్మాణం చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం అన్ని రంగాల‌పై దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనాను సమర్థంగా ఎదుర్కొని కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప్ర‌శంస‌లు పొందిన‌ట్లు చెప్పారు.

మ‌త ప‌ర‌మైన వివాదాల‌ను సృష్టించ‌డానికి  కుట్ర‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను దెబ్బ‌తీసేలా కొన్ని ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. రాష్ట్రంలో మ‌తప‌ర‌మైన వివాదాల‌ను సృష్టించ‌డానికి కొంద‌రు కుట్ర‌లు ప‌న్నార‌ని ఆయ‌న చెప్పారు. అయితే, త‌మ ప్ర‌భుత్వం ఆ కుట్ర‌ల‌ను స‌మ‌ర్థంగా అడ్డుకోగ‌లిగింద‌ని తెలిపారు.