Rishab Pant: ఆరోజు ఇంకో అరగంట నేనుంటేనా?... 3-1 అయ్యుండేదంటున్న పంత్!

  • సిడ్నీ టెస్ట్ ను గుర్తు చేసుకున్న పంత్
  • ఆ రోజు 97 పరుగుల వద్ద అవుట్
  • గెలిపించాలనే చూశానన్న పంత్
If I stay another 30 mins it would be a win says Rishab Pant

ఇటీవల ఆసీస్ లో ముగిసిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టు 2-1 తేడాతో విజయం సాధించి, బార్డర్ - గవాస్కర్ ట్రోఫీని మరోమారు సాధించిన సంగతి తెలిసిందే. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్, చివరి వరకూ అజేయంగా నిలిచి, మిగతా ఆటగాళ్ల నుంచి వచ్చిన ప్రోత్సాహంతో జట్టును విజయపథంలో నడిపించాడు.

తాజాగా, ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పంత్, ఆసీస్ టూర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడవ టెస్ట్ లో తాను మరొక్క 30 నిమిషాల పాటు అవుట్ కాకుండా క్రీజులో నిలబడగలిగి వుంటే భారత విజయం 3-1 అయ్యుండేదని అన్నాడు.

సిడ్నీ టెస్టులో పంత్, కొద్దిలో సెంచరీని మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై హనుమ విహారితో జత కలిసిన రవిచంద్రన్ అశ్విన్, పరుగులు చేయడానికి బదులు క్రీజులో నిలదొక్కుకునేందుకే ప్రయత్నించి, మ్యాచ్ డ్రాగా ముగిసేందుకు తమవంతు సహకారాన్ని అందించారు. ఇదే విషయాన్ని గుర్తు చేసిన పంత్, ఆ మ్యాచ్ లో భారత జట్టుకు గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని, తన దృష్టంతా మ్యాచ్ గెలవడంపైనే ఉందని, అయితే, అన్నిసార్లూ అవకాశాలు లభించవని అన్నాడు. తాను మరికాసేపు క్రీజులో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు.

కాగా, ఆసీస్ తో జరిగిన మూడవ మ్యాచ్ లో పంత్ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన సంగతి గుర్తుండే ఉంటుంది. పంత్ ఆడినంత సేపూ, భారత జట్టు గెలుస్తుందన్న నమ్మకమే అభిమానుల్లో ఉంది. కానీ, పంత్ అవుట్ కాగానే, ఆసీస్ పట్టు బిగించినట్టు కనిపించగా, ఆపై విహారీ, అశ్విన్ లు ఆసీస్ ఆనందంపై నీళ్లు చల్లారు.

More Telugu News