ఆర్థికమాంద్యం కన్నా కరోనా వల్ల జరిగిన నష్టమే ఎక్కువ: ఐఎల్ఓ

26-01-2021 Tue 10:00
  • 2009 నాటి ఆర్థికమాంద్యం కన్నా నాలుగు రెట్ల నష్టం
  • ప్రపంచవ్యాప్తంగా 25.5 కోట్ల ఉద్యోగాలు మాయం
  • 8.3 శాతానికి పడిపోయిన ప్రజల సంపాదన శక్తి
coronavirus loss 4 times more than recession

2009లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థికమాంద్యం కంటే కరోనా మహమ్మారి వల్లే ఈ ప్రపంచానికి తీరని నష్టం జరిగిందని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) పేర్కొంది. నాటి ఆర్థికమాంద్యం కంటే కరోనా వల్ల దాదాపు నాలుగు రెట్ల అధిక నష్టం జరిగిందని తెలిపింది.

కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేయడంతో చాలా కంపెనీలు ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఉద్యోగులను తొలగించాయని పేర్కొంది. ఫలితంగా గతేడాది ప్రపంచవ్యాప్తంగా 8.8 శాతం పనిగంటలను కోల్పోయినట్టు వివరించింది. ఇది దాదాపు 25.5 కోట్ల ఉద్యోగాలకు సమానమని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఈ కాలంలో ప్రజల సంపాదన శక్తి 8.3 శాతం తగ్గినట్టు ఐఎల్ఓ వివరించింది.